Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్నికల గడువు సమీపిస్తుండడంతో హిమాచల్ ప్రదేశ్ లో ప్రచారం ఊపందుకుంది. కంగ్రాలో నిర్వహించిన బీజేపీ ప్రచార సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. అధికార కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ను ప్రధాని లాఫింగ్ క్లబ్ గా అభివర్ణించారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, కానీ ఆ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామని అంటున్నారని మోడీ విమర్శించారు. ఈ విషయాన్ని కనీసం చిన్నపిల్లలు సైతం నమ్మరని, కాంగ్రెస్ ఇప్పుడు లాఫింగ్ క్లబ్ అయిందని ఎద్దేవా చేశారు. డోక్లామ్ వివాదంపైనా కాంగ్రెస్ వైఖరిని మోడీ తప్పుబట్టారు.
డోక్లామ్ సరిహద్దు సమస్య నుంచి ఎలా బయటపడ్డామనే విషయం దేశమంతటికీ తెలుసని, కానీ కాంగ్రెస్ మాత్రం దానిని ప్రశ్నిస్తూనేఉందని మోడీ ఆరోపించారు. నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందిన ఒకరు సొంత దేశ సైన్యంపై నమ్మకం ఉంచరని, చైనా రాయబారిని కలుసుకుని డోక్లామ్ వివాదం గురించి ఆరాతీస్తారని…కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై పరోక్ష విమర్శలు చేశారు. అమర వీరుల త్యాగాన్ని ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ కు లేదని, ఓ కాంగ్రెస్ నేత కాశ్మీర్ స్వాతంత్య్రం గురించి మాట్లాడుతున్నారని పరోక్షంగా చిదంబరం వైఖరిని తప్పుబట్టారు.
హిమాచల్ ప్రదేశ్ ను ఐదు భూతాలు పట్టిపీడిస్తున్నాయని మైనింగ్, మాదకద్రవ్యాలు, టెండర్, అటవీ, బదిలీ మాఫియాలు రాష్ట్రంలో పాతుకుపోయాయని, వాటిని పెకలించాల్సిన సమయం వచ్చిందని మోడీ వ్యాఖ్యానించారు. హిమాచల్ ప్రదేశ్ లోని మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 9న ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. పలు సంస్థలు నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ లో ప్రజలు బీజేపీ వైపు ఉన్నట్టు తేలింది.