బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ లు ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. వారి ఎంగేజ్ మెంట్ కూడా అయిపోయిందనే వార్తలు అప్పుడప్పుడు షికార్లు చేసేవి. ఈ ఊహాజనిత వార్తలన్నింటికీ నేడు ఈ జంట ఫుల్ స్టాప్ పెట్టారు. వారిద్దరి ఎంగేజ్ మెంట్ ఈ ఉదయం ముంబైలోని ప్రియాంక నివాసంలో నిరాడంబరంగా జరిగింది. ఈ సందర్భంగా పసుపు రంగు దుస్తుల్లో ప్రియాంక మెరిసిపోగా… కుర్తా పైజమా ధరించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు నిక్.
పూర్తిగా హిందూ సంప్రదాయంలో ప్రియాంక, నిక్ ల తల్లిదండ్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ప్రియాంక కజిన్, సినీ నటి పరిణీతి చోప్రా కూడా ఈ కార్యక్రమానికి హాజరైంది. ఓ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఆమె ఈ కార్యక్రమం కోసం ముంబైకు వచ్చింది. ఈ సాయంత్రం ముంబైలోని ఓ స్టార్ హోటల్ లో వీరు ఎంగేజ్ మెంట్ పార్టీ ఇస్తున్నారు. తమ కుటుంబసభ్యులకు, స్నేహితులకు ప్రియాంక పార్టీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ పార్టీకి రణవీర్ సింగ్, కరణ్ జొహార్ లతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరవుతున్నారు.