ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) వైసీపీ కండువా కప్పుకున్నారు. జగన్ నివాసమైన హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో పీవీపీతో పాటు కాకినాడ ఎంపీ తోట నరసింహం, విజయవాడ మాజీ మేయర్ రత్నబిందు, సినీనటుడు రాజా రవీంద్ర తదితరులు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ వారందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పీవీపీ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు జగన్ 25ఏళ్ల విజన్ పెట్టుకున్నారని తెలిపారు. విజయవాడ తాను పుట్టి పెరిగిన ఊరని.. ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకునేందుకు జగన్ తనకు అవకాశం ఇచ్చారన్నారు. తన మనసు చెప్పినందువల్లే వైసీపీలో చేరానని తెలిపారు. విజయవాడ నగరాన్ని అన్నివిధాలా డెవలప్ చేసేందుకు జగన్‌తో కలిసి నడుస్తానని చెప్పారు. పీవీపీ వైసీపీ తరపున విజయవాడ నుంచి పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పీవీపీకి విజయవాడ పార్లమెంట్ టికెట్‌ను ఇస్తారనీ, ఈ నెల 23న ఆయన నామినేషన్ వేస్తారని వైసీపీలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి అనుగుణంగానే బుధవారం ఉదయం ఆయన జగన్‌ను కలవడం, వైసీపీలో చేరడం జరిగిపోయాయి. ఇప్పటివరకు పీవీపీ ప్రత్యక్షంగా ఏ పార్టీలోనూ చేరలేదు. గత ఎన్నికల్లో విజయవాడ టీడీపీ ఎంపీ టికెట్‌ను పొందేందుకు శతవిథాలా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలు నెరవేరలేదు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. సడన్‌గా వైసీపీ కండువాతో ప్రత్యక్షమయ్యారు. విజయవాడ పార్లమెంట్ టికెట్‌పై జగన్ భరోసా ఇవ్వడం వల్లే.. ఆయన వైసీపీలో చేరారని ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.