Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టెక్నాలజీ మనిషి జీవనాన్ని సులభతరం చేస్తోందని ఇప్పుడు భావిస్తోన్నా రానున్న రోజుల్లో …ఇది సవాల్ గా మారుతుందని ఎప్పటినుంచో విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం పరిశోధనల దశలో ఉన్న కృత్రిమ మేధస్సు రానున్నరోజుల్లో ప్రపంచగతిని శాసిస్తుందనీ వార్తలొస్తున్నాయి. రష్యాలోని ఓ రోబో చేసిన విన్యాసాలు చూస్తే ఇవన్నీ నిజమే అనిపిస్తుంది. ఎవరినైనా ఒకసారి చూస్తే గుర్తుపెట్టుకునే రోబో ఒకటి రష్యాలో ఉంది. దానిపేరు ప్రొమోబోట్. ఈ రోబో చేసిన ఓ పని ఇప్పుడు అందరినీ సంభ్రమాశ్చర్యాలకు లోనుచేస్తోంది.
పెర్మ్ లో జరుగుతున్న టెక్నాలజీ ఎగ్జిబిషన్ కు పుతిన్ హాజరయ్యారు. అక్కడ స్టాళ్లను పరిశీలిస్తున్న పుతిన్ ను ప్రొమోబోట్ గుర్తుపట్టింది. చేతులు కలుపుతూ తనను తాను పరిచయం చేసుకుంది. పుతిన్ కు ప్రొమోబోట్ షేక్ హ్యాండ్ ఇచ్చిన వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతోంది. ఈ రోబోను రష్యాలో టూర్ గైడ్ గా, సేల్స్ ప్రమోటర్ గా, మోడల్ గా ఉపయోగిస్తారు. రష్యాకు చెందిన కొందరు ప్రముఖుల ముఖాలను ఈ రోబో గుర్తించగలదు. ఆ క్రమంలోనే ప్రొమోబోట్ పుతిన్ ను గుర్తుపట్టిందన్నమాట. ప్రొమోబోటో ఇలా వార్తల్లో నిలవటం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది తయారీ ల్యాబ్ నుంచే ప్రొమోబోట్ తప్పించుకోవటం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. దీని కారణంగా ఒకసారి రష్యాలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. రానున్న రోజుల్లో రోబోటిక్ టెక్నాలజీ ఎలా ఉంటుందో అన్నదానికి ప్రొమోబోట్ ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు.
మరిన్ని వార్తలు: