భారతీయుడిని అయినందుకు మేము గర్విస్తున్నాం…మరి మీరు ?

This Pune firm provided tech support in the Thailand cave rescue issue

గత కొన్ని రోజులుగా థాయిలాండ్ కు సంబందించిన థామ్‌ లువాంగ్‌ గుహల గురించి అనేక వార్తలు టెన్షన్ పెట్టిన సంగతి తెలిసిందే. ఎక్కడ ఆ బాలుర గురించి చేదుగా రాయ వలసి వస్తుందో అని ఇప్పటి వరకు మేము ఆ ఘటనకు సంబంధించి ఒక్క వార్త కూడా రాయలేదు. కానీ థామ్ లువాంగ్ గుహలో ప్రపంచం కనీవినీ ఎరుగని అత్యద్భుతం ఆవిష్కృతమైంది. వైల్డ్బోర్ సాకర్ టీమ్ కి చెందిన 13 మంది సభ్యులు సురక్షితంగా ప్రాణాలతో బయటికి వచ్చారు. వరదనీటితో నిండిన గుహల నుంచి కోచ్ సహా పిల్లలంతా ప్రాణాలతో భద్రంగా బయట పడినట్టు తెలిసి కోట్లాది మంది ప్రజలలాగే మేమూ ఊపిరి పీల్చుకున్నాం. మొదట్లో వారు బ్రతకడం కష్టమే అని అంతా భావించారు.

మూడు నెలల సమయం పడుతుందని కూడా చెప్పడం భయాన్ని కలిగించింది. కానీ థాయ్ చిన్నారుల కోసం ప్రపంచం మొత్తం సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఎలాగైనా వారు సురక్షితంగా రావాలని తమవంతు సహాయాన్ని అందిస్తామని ప్రపంచ దేశాలు ముందుకు వచ్చాయి. ఎలన్‌ మస్క్‌ అనే పారిశ్రామిక శాస్త్రవేత్త ఏకంగా ఓ చిన్నపాటి జలాంతర్గామిని చిన్నారులను రక్షించడానికి తయారు చేయించి దానితో పాటు గుహ వద్దకు చేరుకోగా, అమెరికా అధ్యక్షుడు కూడా తమవంతు సహాయం చేస్తాము అని ప్రకటించాడు.

ఇక ఈ ఆపరేషన్ లో సాకర్ ప్లేయర్స్ ను రక్షించేందుకు భారత్ నుంచి కూడా సహాయం అందింది అని తెలుస్తోంది. థామ్‌ లువాంగ్‌ గుహలలో భారీ నీరు చేరకుండా నీళ్లను బయటకు పంపేందుకు ఇండియన్ మెకానికల్ ఇంజినీర్లు ముఖ్య పాత్ర పోషించారని తెలుస్తోంది. అవసరం అయితే పుణెలోని కిర్లోస్కర్‌ బ్రదర్స్‌ లిమిటెడ్‌(కేబీఎల్‌)కు చెందిన సాంకేతిక నిపుణుల సాయం తీసుకోవాల్సిందిగా భారత రాయబార కార్యాలయం నుంచి థాయ్‌ అధికారులకు సమాచారం అందింది. వారు సహాయం కావాలని కోరడంతో యుద్ద ప్రాతిపదికన రంగంలోకి దిగిన కేబీఎల్‌ టెక్నీషియన్స్ థామ్‌ లువాంగ్‌కు చేరుకున్నారు. అక్కడ గుహల్లోని వర్షపు నీటిని ఎప్పటికప్పుడు పంపులతో బయటకు పంపేందుకు కృషిచేశారు.

నీటిని తోడేందుకు ఉపయోగించే పంపుల పనితీరును పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వాటి కండీషన్‌ గురించి పరిశీలించారు. నీటిని త్వరిగతిన తోడేందుకు నాలుగు అత్యాధునిక ‘ఆటోప్రైమ్‌ డీవాటరింగ్‌’ పంపులను కూడా థాయ్‌లాండ్‌కు పంపించేందుకు మహారాష్ట్రలోని కిర్లోస్‌వాడి ప్లాంట్‌లో సిద్ధంగా ఉంచినట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది. కానీ వాటి అవసరం పడకుండానే పని పూర్తయ్యింది. నీటి నిల్వ విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకొని కేబీఎల్‌ టెక్నీషియన్స్ చేసిన సహాయానికి థాయ్ ప్రభుత్వ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏ వైపరీత్యం జరిగినా ముందుండే భారత్ ఇక్కడ కూడా తన వంతు సేవలను అందించింది. కిర్లోస్కర్ కంపెనీతో ఏ సంబంధాలు లేకపోయినా ఒక సగటు భారతీయుడిగా నేను గర్విస్తున్నా ఈ మహత్కార్యంలో భారత్ భాగమయినందుకు….మరి మీరు ?