Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విజయదశమి అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు. అందుకే పండుగ రోజు… రావణుడి బొమ్మను దహనం చేయటం ఆనవాయితీ. దేశవ్యాప్తంగా రావణ దహనం కార్యక్రమాలు సాగినా… పూణే వాసులు చేసే కార్యక్రమానికి ఓ విశేషం ఉంది. సమకాలీన సమస్యలను రావణుడిగా భావిస్తూ దహనం చేస్తుంటారు. గతంలో ఉగ్రవాదం, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, నిరుద్యోగం వంటి సమస్యలకు నిరసనగా… ప్లకార్డులు తయారీచేసి… వాటిని రావణుడి బొమ్మకు తగిలించి దహనం చేస్తారు. అలా ఈ ఏడాది డేరాబాబాను రావణుడి స్థానంలో ఉంచి దహనం చేశారు పూణె వాసులు.
డేరా బాబా చీకటి జీవితం వెలుగుచూసిన తర్వాత వచ్చిన తొలి దసరా ఇదే. ఇద్దరు సాధ్విలపై అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరాబాబా గురించి రోజుకో దారుణం వెలుగు చూస్తున్న నేపథ్యంలో గుర్మీత్ ను రావణుడితో పోల్చుతూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. గుర్మీత్ తో పాటు ఆశారాం బాపూ వంటి నకిలీ బాబాల ఫొటోలను రావణుడి స్థానంలో ఉంచి దహనం చేశారు. క్రూరుడైన బాబా బొమ్మను దహనం చేయటం ద్వారా …చెడుపై మంచి విజయం సాధిస్తుందన్న సందేశం ఇస్తున్నామని పూణె లోకమాన్య ఫెస్టివల్ నిర్వాహకులు అన్నారు. 20 ఏళ్లగా ఇలా సమకాలీన సమస్యలపై ప్లకార్డులు తయారుచేసి రావణుడిగా భావిస్తూ దహనం చేస్తున్నామని వివరించారు.