పురందేశ్వరి ప్రచారం దూరం పెంచుతుందా…?

Purandeswari Blessings To Nandamuri Suhasini

తండ్రి ఆశయాలకు భిన్నంగా కేవలం చంద్రబాబు మీద కోపంతో కాంగ్రెస్ లో చేరి మంత్రి పదవి అనునుభవించి ఆ తర్వాత అక్కడ భవిష్యత్తు లేదని తెలిసి బీజేపీలోకి వెళ్లిన దగ్గుబాటి పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ లో ఉంటే రాజకీయ భవిష్యత్తు లేదని తెలిసి బీజేపీలో చేరిన పురందేశ్వరి అక్కడా ఎదురీదుతున్న సంగతి తెలిసిందే. విభజన తర్వాత కాంగ్రెస్ మీద రాష్ట్ర ప్రజలు ఎంతటి ఆగ్రహాన్ని ప్రదర్శించారో… ఇప్పుడు బీజేపీ మీద అంతకంటే ఎక్కువ కోపంతో వున్నారు. ఈ విషయం పక్కన పెడితే తెలంగాణా ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తున్న ఆమె ఒకరకంగా పరోక్షంగా టీడీపీకి జై కొట్టారు. టీపీపీ అభ్యర్థికి నా మద్దతు అని చెప్పి బీజేపీకి షాకిచ్చారు. తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ అక్కడా కూడా ఎదురీదుతోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నేతలంతా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా మల్కాజిగిరిలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పురందేశ్వరి పాల్గొన్నారు. అక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావుకు మద్దతుగా బుధవారం నిర్వహించిన రోడ్‌ షోలో ఆమె మాట్లాడారు.

Telugu Farmer Shocking Questions To Purandeswari In Karnataka Campaign

భావసారూప్యత, సిద్ధాంతాలంటూ లేని మహాకూటమిని, అవినీతిలో కూరుకుపోయిన టీఆర్ఎస్‌ను రానున్న ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించాలని పురందేశ్వరి పిలుపునిచ్చారు. అభివృద్ధిని కోరుకుని తమ జీవితాలను బంగారుమయం చేసే కమలం గుర్తుకు ఓటేసి రాంచందర్‌రావును గెలిపించాలని కోరారు. బీజేపీని ఓడించేందుకు, మోడీని గద్దె దింపేందుకు మాత్రమే మహాకూటమి ఏర్పడిందన్నారు. అయితే.. మోడీని ఎందుకు గద్దె దింపాలో చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. అలాగే ఆమె యధాప్రకారం మహాకూటమి మీద విమర్శలు చేసిన ఆమె అనూహ్యంగా కూకట్ పల్లిలో మాత్రం తన మేనకోడలికే తన మద్దతు అని పరోక్షంగా చెప్పి అందరిని విస్మయానికి గురి చేశారు. ‘కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్న నందమూరి సుహాసినికి మీ సహకారం ఉంటుందా’ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు పురందేశ్వరి నవ్వుతూ బదులిచ్చారు. ఓ మేనత్తగా కోడలికి ఎప్పుడూ ఆశీర్వాదం ఉంటుందన్నారు. పార్టీ పరంగా తాము వ్యతిరేకమైనా మేనకోడలిగా ఆమెకు తన దీవెనలు ఉంటాయని పురంధేశ్వరి స్పష్టం చేశారు. అయితే ఈరోజు కూకట్‌పల్లి బీజేపీ అభ్యర్థి మాధవరం కాంతారావుకు మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. అయితే ఇప్పుడు ఆమె తన కోడలు పోటీ చేస్తున్న నియోజకవర్గానికి వెళ్లి ఏమని ప్రచారం చేస్తారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే మేనకోదలికే ఆశీర్వాదం అని ఇంతకు ముందే చెప్పారు, ఇప్పుడు పార్టీ తరపున ప్రచారానికి వస్తున్నారు. ఇప్పటికే దూరం దూరంగా ఉన్న నందమూరి-దగ్గుబాటి కుటుంబాలు ఈ ప్రచారం వలన మరింత దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Purandeswari-suhasini