చిన్నమ్మా….ఏంటమ్మా ఇది…!

Purandeswari Comments On Tdp And Congress
గత కొద్ది రోజులుగా తెలుగుదేశం కాంగ్రెస్ పొత్తుకు వెళతాయన్న వార్తలు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయంసంగా మారాయి. అసలు తెలుగుదేశం నుండి కానీ కాంగ్రెస్ నుండి కానీ ఎటువంటి ప్రకటనలు లేకున్నా ఒక పుకారుగా వచ్చిన ఈ వార్త ఇప్పుడు కలకలం రేపుతోంది. తాజాగా ఈ విషయం మీద ప్రస్తుత బీజేపీ నేత మాజీ కాంగ్రెస్ ఎంపీ ఎన్టీఅర్ కుమార్తె పురందరేశ్వరి స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తును ఎన్టీఆర్ కుమార్తెగా వ్యతిరేకిస్తానని ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు. అంతే కాక ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ ఎలా స్పందిస్తారో చూడాలని ఉందని ఆమె అన్నారు.
ap1
అయితే ప్రస్తుతం భాజపాలో ఉన్న ఆమె కాంగ్రెస్ పార్టీపై అంత వ్యతిరేకత చూపించడంలో అర్థం ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ విషయంలోకి ఎన్టీఅర్ కుటుంబాన్ని తీసుకు రావడం ఏంటో ఆమెకే అర్ధం కావాలి. ఎందుకంటే ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడారు అనేది అక్షర సత్యం. ఈ కారణంతోనే ఎన్టీఆర్ కుమార్తెగా కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తును వ్యతిరేకిస్తానని ప్రకటించారు ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఆమె గతం మరచినట్లున్నారు.
ఎందుకంటే ఎన్టీఆర్ వ్యతిరేకించిన అదే కాంగ్రెస్‌లో ఆమె ఎన్టీఆర్ కుమార్తె అనే స్పెషలైజేషన్ తో చేరారు. ఆదే స్పెషలైజేషన్ తో ఎంపీ సీటు తెచ్చుకున్నారు. అదే స్పెషలైజేషన్ తో రెండు సార్లు గెలుపొందారు. అలాగే కేవలం ఎన్టీఆర్ కుమార్తె అన్న కారణంగానే సీనియర్లను పక్కన పెట్టి ఆమెకు మంత్రివర్గంలో చోటు కూడా కల్పించారు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. అంటే తాను ఎన్టీఆర్ కుమార్తె అయ్యుంది తన తండ్రి జీవితాంతం వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీలో చేరి పదేళ్ల పాటు పదవులు అనుభవిస్తే తప్పు లేదు కానీ ఒక వేళ మోడీ మీద పోరాటంలో కాంగ్రెస్ మద్దతు తీసుకుంటే మాత్రం తప్పనిపించిందట.
ap2
ఎన్టీఆర్ లాగా పురందరేశ్వరి కూడా కాంగ్రెస్ పార్టీపై మొదటి నుంచి వ్యతిరేకత  చూపిస్తూ ఉంటే ఆమె మాటలకు విలువ ఉండేది. కానీ ఏ కాంగ్రెస్ పార్టీని అయితే ఇప్పుడు ఆమె వ్యతిరేకిస్తున్నారో అదే కాంగ్రెస్ పార్టీలో పదేళ్ల పాటు అధికారం అనుభవించి .. ఇప్పుడు.. అదేమీ గుర్తు లేనట్లు విమర్శలు చేస్తున్నారు. రాజకీయం అంటే ఇంతేనేమో ? ఏరు దాటాక తెప్ప తగలెయ్యడం.