Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చంద్రుడు పుష్యమి నక్షత్రం లో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. “పుష్య”అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. పుష్య మాసం శీతాకాలం. ఆధ్యాత్మికంగా జపతపాదులు, ధ్యానపారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించి అందరు దోషరహితులయ్యే పుణ్య మాసం పుష్యం. పుష్యపౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనది గా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం గా చెప్పబడింది. ఈ మాసం లో రైతులకి పంట చేతికి వచ్చే కాలం కావున ధాన్య లక్ష్మి, ధన లక్ష్మి రూపం లో లక్ష్మీ దేవి ని విష్ణు మూర్తి సమేతం గా పూజిస్తారు.
ఈ మాసం లో గృహ ప్రవేశాలు, పెళ్ళిళ్ళు, శంఖు స్థాపనలు వంటి శుభకార్యాలు చేయడానికి వీలులేనప్పటికీ సాధారణ పూజలు, పెద్దలని స్మరించుకొని చేసే అన్ని పుణ్య కార్యాలకి విశేష మాసం గా చెప్పవచ్చు. పుష్య మాసానికి అధిపతి అయిన శని మరియు నక్షత్రాదిపతి అయిన గురువు ని పూజించడం వలన విశేష ఫలితం లభిస్తుంది.. పుష్యమాసం లో శని గ్రహానికి అమావాస్య రోజున తైలాభిషేకం నిర్వహించడం ద్వారా శని బాధ నివృత్తి జరుగుతుంది. వీటితో పాటుగా వస్త్ర దానం, తిల దానం, అన్న దానం చేయడం వలన శని యొక్క దోషాలు తొలగి శుభఫలితాలు పొందవచ్చు. పుష్య పౌర్ణమి రోజున నది స్నానం చేయడం వలన సకల పాపాలు తొలగుతాయి . ఈ రోజు చేసే దానాల వలన పుణ్య ఫలితం అధికం గా ఉంటుంది అని చెప్పబడింది. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేది పుష్య మాసం లోనే ఉత్తరాయణ పుణ్య కాలం ప్రవేశించేది ఈ మాసం లోనే. సూర్యుడు ధనురాశి నుండి మకర రాశి లో ప్రవేశించడమే మకర సంక్రాంతి.