Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉత్తరకొరియా అణ్వస్త్ర పరీక్షలపై జపాన్, అమెరికా మండిపడుతోంటే..రష్యా మాత్రం ఇందుకు విరుద్ధంగా స్పందించింది. ఉత్తరకొరియా వైఖరిని రష్యా సమర్థించకపోయినప్పటికీ..ఆత్మ రక్షణ కోసమే ఆ దేశం అణ్వస్త్ర పరీక్షలు జరుపుతోందని రష్యా విశ్లేషించింది. జపాన్ భూభాగం మీదగా ఉత్తరకొరియా జరిపిన క్షిపణి పరీక్షను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండించారు. ఇలాంటి చర్యలు ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పటికిప్పుడు అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించటం ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆపబోరని, ఐక్యరాజ్యసమితి ఎన్ని ఆంక్షలు విధించినా..కిమ్ తన తీరు మార్చుకోరని పుతిన్ విశ్లేషించారు. చివరకు గడ్డి తినడానికి కూడా సిద్ధపడతారు కానీ.
కిమ్ అణ్వస్త్ర పరీక్షలకు మాత్రం స్వస్తి పలకరని పుతిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి కారణం కిమ్ అభద్రతాభావంలో ఉండటమే అన్నారు రష్యా అధ్యక్షుడు. అణ్వస్త్ర పరీక్షలను ఆపితే ఏం జరుగుతుందో కిమ్ కు తెలుసని, తాను కూడా సద్దాం హుస్సేన్ లా అయిపోతాననే భయం ఆయనలో ఉందని, ఆ భావాన్ని అమెరికానే తొలగించాలని పుతిన్ సూచించారు. ఆంక్షలు విధించటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్న పుతిన్, చర్చల ద్వారా మాత్రమే సమస్య పరిష్కారమవుతుందని అభిప్రాయపడ్డారు.