కాలేజ్ ల విష సంస్కృతి ‘ర్యాగింగ్’ ఇప్పుడు పాఠశాలల్లోనూ బీజాలు నాటుకుంటోంది. ర్యాగింగ్ భూతం బారిన పడి పదో తరగతికి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేయడం హైదరాబాద్‌లోని సరూర్ నగర్లో కలకలం రేపుతోంది. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కర్మాన్‌ఘాట్‌లో ‘నియో రాయల్’ స్కూల్లో తోటి విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడటంతో వేధింపులకు తాళలేక ఓ విద్యార్థి ఉరేసుకొని బలవన్మరణానికి ప్రయత్నించాడు. గొంతు ప్రాంతంలో నరాలు చిట్లడంతో ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గ్రీన్ పార్క్ కాలనీకి చెందిన రవికిరణ్ కర్మాన్ ఘాట్‌లోని నియో రాయల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. కొంత కాలంగా తోటి విద్యార్థులు అతణ్ని ర్యాగింగ్ చేస్తున్నారు. డబ్బులు తీసుకొని రావాలని బెదిరిస్తున్నారు. విద్యార్థుల వేధింపులకు భయపడిన రవికిరణ్ తల్లిదండ్రులకు తెలియకుండా ఇంట్లో నుంచి పలు దఫాలుగా రూ.6 వేలు తీసుకొచ్చి వారి చేతుల్లో పెట్టాడు. రవికిరణ్ భయాన్ని అలుసుగా చేసుకున్న తోటి విద్యార్థులు అతణ్ని మరింతగా భయపెట్టి రూ.10,000 తీసుకురావాల్సిందిగా హెచ్చరించారు. దీంతో భయాందోళనకు గురైన బాధితుడు తోటి విద్యార్థుల వేధింపులు భరించలేక, ఇంట్లో వాళ్లను మోసం చేయలేక ఉరేసుకొని చనిపోవడానికి యత్నించాడు. ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థి రవికిరణ్ అంతుకుముందు సూసైడ్ నోట్ రాసిపెట్టాడు. ‘డాడీ ఐ యామ్ సారీ.. వారి వల్లే నేను చనిపోతున్నా.. ఐ యామ్ మిస్సింగ్ యూ మమ్మీ’ అంటూ అతడు లేఖలో రాశాడు. రెండు రోజుల కిందట చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అతడు ఎల్బీ నగర్‌లోని గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.