Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయ ఆరోపణలు, విమర్శలు ఏ స్థాయిలో వుంటాయో చెప్పుకునేందుకు ఇదో పెద్ద ఉదాహరణ. ఏపీ ప్రభుత్వం ఎండోమెంట్ యాక్ట్ లో తెచ్చిన మార్పులతో టీటీడీలో సన్నిధి గొల్ల వంశస్థులకి ఎప్పటినుంచో ఇస్తున్న కైంకర్యాలు రద్దు అవుతున్నాయి. దీంతో ఆందోళన చెందిన వాళ్ళు ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడానికి pcc అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ని ఆశ్రయించారు. ఆయన ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళుతూ ఓ లేఖ రాశారు. ఆ లేఖలో ఈ నిర్ణయాన్ని మార్చుకోకపోతే సాక్షాత్తు శ్రీవారి నిర్ణయాన్ని ధిక్కరించినట్టే అని అభిప్రాయపడ్డారు. ఆ లేఖ యధాతధంగా తెలుగుబుల్లెట్ పాఠకుల కోసం…
గౌరవనీయులు
నారా చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు.
నమస్కారం.
విషయం : తిరుమల శ్రీవారి తొలి దర్శన వరాన్ని పొందిన సన్నిధిగొల్ల వంశస్థులకు భగవంతుడు ఇచ్చిన కైంకర్యాలను యధాతదంగా (మిరాసి రద్దు తరువాత బ్రాహ్మణులకు ఏ సౌకర్యాలు కల్పిస్తున్నారో ఆ విధంగా) కొనసాగించాలని, శ్రీ గొల్ల శరభయ్య యాదవ్ పేరుపైన సముచిత సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.
తిరుమల శ్రీవారి సన్నిధిలో తొలి దర్శన వరం పొందిన శ్రీ గొల్ల శరభయ్య వంశస్థులు తరతరాలుగా అనునిత్యం శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. గొల్లమిరాసి అనే పేరుతో శ్రీవారి వరప్రసాదంగా పొందిన కైంకర్యాలను ఇంతకాలం ఈ వంశస్థులు పొందుతూ వచ్చారు. అయితే రాష్ర్ట ప్రభుత్వం ఎండోమెంట్ యాక్టు 34లో తెచ్చిన మార్పుల కారణంగా సన్నిధిగొల్ల వంశస్థులు ఇంతకాలం పొందిన కైంకర్యాలు రద్దు అవుతున్నాయి. సన్నిదిగొల్ల వంశస్థుల విషయంలో టిడిపి మరియు ప్రభుత్వం చేసిన నిర్ణయాలు శ్రీ వెంకటేశ్వరస్వామి నిర్ణయాలను సమీక్షించడమే అవుతుందని, ప్రభుత్వ నిర్ణయాల కారణంగా తమకు అన్యాయం జరుగుతుందని సన్నిధిగొల్ల వంశస్థులు ఆందోళన చెందుతున్నారు.
ముఖ్యంగా సన్నిధిగొల్ల శరభయ్య వంశస్థులు ప్రభుత్వం దృష్టికి తీసుకురమ్మని మమ్మల్ని కోరిన విషయాలను మీకు తెలియచేస్తున్నాను. ఇంతకు ముందే ఈ అంశాలను మీ దృష్టికి వినతిపత్రం ద్వారా తీసుకువచ్చాను.
1. సన్నిధిగొల్ల వంస్థులకు భగవంతుడు ఇచ్చిన కైంకర్యాలను యధాతదంగా అనగా నేడు బ్రాహ్మణులకు మిరాశి రద్దు తరువాత ఏ సౌకర్యాలు కల్పిస్తున్నారో సన్నిధిగొల్ల కుటుంబాలకు యధాతదంగా కొనసాగించాలి. అదేవిధంగా ఎండోమెంట్ యాక్టు 34లో సవరణలు చేసి సన్నిధిగొల్లలకు తగిన న్యాయం చేయాలి.
2. గతంలో మిరాశి ఉన్నప్పుడు సన్నిధిగొల్ల కుటుంబాలు ఏ విదంగా ఆర్థికసాయం పొందాయో అదేవిధంగా భగవంతుడు వరం పొందిన వీరికి ప్రత్యేక ఆర్థిక సాయం కలిగే విధంగా చర్యలు తీసుకోవాలి.
3. సుప్రభాతం, ఏకాంత సేవల సమయాలు మారినందున నలుగురు కైంకర్యంలో ఉండే విధంగా ఏర్పాటు చేయాలి.
4. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ఇస్తున్న అన్ని సదుపాయాలను సన్నిధిగొల్ల కుటుంబాలకు వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలి.
5. సన్నిధిగొల్ల శరభయ్య వంశస్థుల పేరుపైన ఒక మఠాన్ని ఏర్పరచి అక్‌ండి నుంచి స్వామివారి తలుపు తెరవడం మరియు మొదటి దర్శనం కలిగించడం టిటిడి వారి కనీస ధర్మంగా చేయాలి.
6. శరభయ్య విగ్రహాన్ని తిరుమలలో ప్రతిష్టింపజేసి పూజా కైంకర్యాలు సైతం జరిపించాలి.
7. సన్నిధిగొల్ల శరభయ్య విశిష్టతను తెలియజేసే విధంగా సేవా కార్యక్రమాలను ప్రవేశపెట్టాలి. శ్రీవారి భక్తులు సన్నిధిగొల్ల వంశస్థులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.
ధన్యవాదాలతో
డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి
మరిన్ని వార్తలు