Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఓ వ్యక్తి తనకు సంబంధించిన రంగంలో అత్యుత్తమ స్థానానికి ఎదిగితే… ఇక యువతకు ఆ వ్యక్తి రోల్ మోడల్ అవుతాడు. తాము అభిమానించే సెలబ్రిటీని అన్ని విషయాల్లో ఇమిటేట్ చేస్తుంటారు… యువతీ యువకులు. మనదేశంలో సినీ తారలు, క్రికెట్ క్రీడాకారులను యువత రోల్ మోడల్ గా భావిస్తుంది. ఓ సినిమా సూపర్ హిట్టయితే ఆ హీరో, హీరోయిన్ ను యువతీయువకులు ఇమిటేట్ చేస్తుంటారు. వారిలా మాట్లాడడం, డ్రెస్ అప్ అవడం, ప్రవర్తించడం చేస్తుంటారు. . సాధారణ ప్రజలు సినిమా తారలను ఇలా ఇమిటేట్ చేస్తే పెద్దగా నష్టం ఏమీ ఉండదు. కానీ ఆ హీరో, హీరోయిన్లలానే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇతర నటులు, వారిలా సినిమాలను కెరీర్ గా ఎంచుకుందామనుకునే యువతీ యువకులు ఇలా అనుకరిస్తే మాత్రం వాళ్లకు చాలా నష్టం కలుగుతుంది. తాము అభిమానించేవారిని ఇమిటేట్ చేసే క్రమంలో తమ ప్రత్యేకతను కోల్పోతారు. తద్వారా..వాళ్లకెరీర్ ప్రమాదంలో పడుతుంది. ఇలా సినిమా ఇండస్ట్రీలో ఇతరులను అనుకరించడం ద్వారా అవకాశాలు కోల్పోయిన వారు చాలామందే ఉన్నారు. అయితే సినిమాల్లోనే కాదు..
క్రికెట్ సెలబ్రిటీల విషయంలోనూ ఇది జరుగుతుంది.ఓ క్రికెటర్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని మంచి ఫామ్ లో ఉంటే..దేశవ్యాప్తంగా అతని పేరు మార్మోగుతుంది. వ్యాపార ప్రకటనలు క్యూ కడతాయి. ఎక్కడ చూసినా ఆ క్రికెటర్ కు సంబంధించిన సంగతులే హల్ చల్ చేస్తుంటాయి. దీంతో జూనియర్ క్రికెటర్లు ఆ క్రికెటర్ ను అన్ని విషయాల్లో ఇమిటేట్ చేస్తుంటారు. ప్రస్తుతం భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ విషయంలో ఇదే జరుగుతోంది. భీకరమైన ఫామ్ లో ఉండి, మ్యాచ్ లను ఒంటిచేత్తో గెలిపిస్తూ..అటు కెప్టెన్ గానూ, ఇటు ఆటగాడిగానూ అత్యుత్తమ స్థాయిలో ఉన్న విరాట్ కోహ్లీ నేడు దేశంలో ఎందరో కుర్రాళ్లకు రోల్ మోడల్. కోహ్లీలా ఉండాలని, కోహ్లీలా కనిపించాలని యువత ఆరాటపడుతున్నారు. ఎక్కువగా ఫ్యాషన్ ట్రెండ్స్ అనుసరిస్తూ ఉంటాడు కోహ్లీ. చేతికి పచ్చబొట్టు..ఫ్రెంచ్ గడ్డం ఇలా..ఫ్యాషన్ ఐకాన్ లా కనిపిస్తుంటాడు. విరాట్ ను అభిమానించే యువకులు కూడా..ఈ ఫ్యాషన్ ను ఫాలో అవుతున్నారు. అయితే ఈ అనుకరణ ఫ్యాషన్ కు వరకు పరిమితమయితే ఎలాంటి సమస్యాలేదు. కానీ కొందరు కుర్రాళ్లు ఆట విషయంలోనూ విరాట్ లా కావాలని కోరుకుంటున్నారు.
క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్న కుర్రాళ్లు విరాట్ కోహ్లీ ఆటతీరును, ప్రవర్తనను ఇమిటేట్ చేస్తూ ఆయనలా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు దీనిపై మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ ఆందోళన వ్యక్తంచేశాడు. ఇప్పుడు ప్రపంచంలోని మేటిఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడని, అయితే అతడి చర్యలను జూనియర్లు క్రికెటర్లు అనుకరించడం తనకు ఆందోళన కలిగిస్తోందని రాహుల్ ద్రావిడ్ వ్యాఖ్యానించాడు. విరాట్ ఏం చేశాడన్నది కాదని, 12, 13, 14 ఏళ్ల వయసు క్రీడాకారులు విరాట్ కోహ్లీలా కావాలనుకుంటున్నారని, అలా చేయడం వల్ల తాము తమలా ఉండకపోవచ్చన్న విషయం వారికి అర్ధం కావడం లేదని ద్రవిడ్ ఆందోళన వ్యక్తంచేశాడు. క్రికెట్లో ఇప్పటికీ ప్రదర్శనే ముఖ్యమని, దూకుడుగా ఉండడం కోహ్లీ వ్యక్తిత్వమని, అయితే కోహ్లీ తాను తనలా ఉన్నంతకాలం, అతడిలో అత్యుత్తమ ఆట బయటికొచ్చేందుకు అది ఉపకరిస్తున్నంతకాలం అతడు ఎలా ప్రవర్తిస్తున్నాడన్నది పెద్ద విషయం కాదని ద్రవిడ్ అన్నాడు.
ఆస్ట్రేలియాతో సిరీస్ కు ముందు కోహ్లి చేసిన అనుచిత వ్యాఖ్యలను పత్రికల్లో చదివినప్పుడు చాలా ఇబ్బందికి గురయ్యాయని ద్రవిడ్ అన్నాడు. అయితే తర్వాత దీనిపై తాను ఆలోచించానని, విరాట్ మాటల పోటీని కోరుకుంటున్నాడని, నోటికి పనిచెబితేనే అతడిలో అత్యుత్తమ ఆట బయటికొస్తుందేమో అని తర్వాత అనిపించిందని రాహుల్ అభిప్రాయపడ్డాడు. అయితే విరాట్ లా ప్రవర్తించడం అందరి వల్లా కాదని, అజంక్య రహానే తీరు పూర్తిగా భిన్నమని, మరోరకంగా అతడు తనలోని అత్యుత్తమ ఆటను బయటకి తెస్తాడని, ఎవరిపట్ల వారు నిజాయితీగా ఉండడం చాలా ముఖ్యమని ద్రవిడ్ అన్నాడు. కోహ్లీలా ఎందుకు ప్రవర్తించలేదు అని తనను అడుగుతుంటారని, కానీ తనలో అత్యుత్తమ ఆటను వెలికితీసింది అది కాదని ద్రవిడ్ అన్నాడు. విరాట్ లా పచ్చబొట్టు వేసుకుని, అతడిలా ప్రవర్తిస్తే..తనకు తానే కృతిమంగా ఉండేవాణ్నని రాహుల్ ద్రావిడ్ వ్యాఖ్యానించాడు. అలాగే అందరూ కూడా తమ ప్రత్యేకతలను నిలబెట్టుకోవాలని…ఇతరులను స్ఫూర్తిగా తీసుకోవాలి కానీ…వారిని అనుకరించకూడదని ఆయన సూచించాడు.