Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పెట్రోల్, డీజిల్ ధరలపై తొలుత లీటర్ కు రూ.60 పైసలు తగ్గించినట్టు వచ్చిన వార్తలు విని… కాస్త పర్లేదు అని అనుకునేలోపే… తగ్గింది 60 పైసలు కాదని, ఒక పైసామాత్రమేనని చమురు సంస్థలు ప్రకటించడం చూసి సామాన్యులంతా విస్తుపోయారు. ధర పైసా తగ్గడం అంటే అసలు తగ్గడమేనా అని సోషల్ మీడియాలో సెటైర్లు కూడా పేలుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా దీనిపై ట్విట్టర్ లో స్పందించారు. ప్రధానిని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. డియర్ పిఎం… ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలను ఒక్క పైసా తగ్గించారు. ఇది మోడీ ఐడియానే అయితే, చిన్నపిల్లల ఆలోచనలా, ఏ మాత్రం పరిణతి లేని చర్యలా ఉంది అని రాహుల్ విమర్శించారు.
చాలా చెత్తగా ఉంది. నేను గతవారం విసిరిన ఇంధన సవాల్ కు ఇది సరైన స్పందన కాదు అని రాహుల్ ట్వీట్ చేశారు. చమురు ధరలు చుక్కలనుంటుతుండడపై జాతీయస్థాయిలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో గత వారం రాహుల్ మోడీకి ఇంధన సవాల్ విసిరారు. భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ విసిరిన ఫిట్ నెస్ ఛాలెంజ్ ను అంగీకరించిన ప్రధాని దమ్ముంటే ఇంధన సవాల్ స్వీకరించి పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించాలని రాహుల్ సవాల్ చేశారు.