Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్నాటక పరిణామాలపై మరోసారి విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్న ఛత్తీస్ గఢ్ లో ఓ బహిరంగసభలో ప్రసంగించిన రాహుల్ బీజేపీని, ఆరెస్సెస్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మనదేశంలోనే ఉన్నామా? లేక పాకిస్థాన్ లోనా అన్న ఆందోళన కలుగుతోంది అని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిణామాలతో దేశంలో భయాందోళనలు నెలకొన్నాయన్నారు. జేడీఎస్ ఎమ్మెల్యేలకు రూ. 100 కోట్లు ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసినట్టు వచ్చిన ఆరోపణలను రాహుల్ ప్రస్తావించారు.
భారత్ పేద దేశం కాదని, డబ్బంతా కొంతమంది చేతుల్లోనే చిక్కుకుని ఉందని, బీజేపీ, ఆరెస్సెస్ రాజ్యాంగ వ్యవస్థలకు మనుగడ లేకుండా చేస్తున్నాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.బీజేపీ సుప్రీంకోర్టు జడ్జిలను కూడా భయపెడుతోందని, ఇలాంటిది నియంతృత్వంలోని జరుగుతుందని విరుచుకుపడ్డారు. భయం, అభద్రతతో కూడిన వాతావరణం దేశంలో ప్రబలంగా ఉందని, దేశంలోని అన్ని వ్యవస్థలను ఆరెస్సెస్ ఆ విధంగా మార్చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగంపైనే దాడి జరుగుతోందని, కర్నాటకలో ఒకవైపు ఎమ్మెల్యేలంతా నిలబడి ఉంటే వారికి వ్యతిరేకంగా మరోవైపు గవర్నర్ ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ ప్రతిసారీ అవినీతి గురించి మాట్లాడుతుందని, రాఫెల్ ఒప్పందం, అమిత్ షా కుటుంబంలోని అవినీతి గురించి కూడా తప్పక మాట్లాడాలని రాహుల్ ఎద్దేవాచేశారు.