Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాంగ్రెస్ అధ్యక్షురాలిగా 19 ఏళ్ల క్రితం సోనియాగాంధీ బాధ్యతలు చేపట్టినప్పుడు ఆమె సామర్థ్యంపై ఎవరికీ పెద్దగా విశ్వాసం లేదు. నెహ్రూ-గాంధీ కుటుంబ ఘనమైన వారసత్వాన్ని ఆమె విజయవతంగా కొనసాగిస్తారన్న నమ్మకాన్ని సాధారాణ కార్యకర్త సైతం వ్యక్తంచేయలేదు. ఒక్క కాంగ్రెసే కాక…జాతీయ రాజకీయాలే దిశానిర్దేశం లేకుండా సాగుతున్న కాలంలో దేశంలో అతి పెద్ద పార్టీ అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఊహించినట్టుగానే ఆమె తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అయితే ఆమె పోటీచేసిన ఓ నియోజకవర్గంలో గెలుపొందడంతో పాటు ఓ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ను అధికారంలోకి తేగలిగారు. అధ్యక్షురాలిగా సోనియా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న తొలి సందర్భమది. ఆ రాష్ట్రమే కర్నాటక.
1999 ఎన్నికల్లో బళ్లారి నుంచి లోక్ సభకు పోటీచేసిన సోనియా బీజేపీ తరపున పోటీచేసిన సుష్మాస్వరాజ్ పై గెలుపొందారు. అలాగే ఎస్.ఎం.కృష్ణ నేతృత్వంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేగలిగారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం వాజ్ పేయి నేతృత్వంలోని బీజేపీ గెలుపొంది, మిత్రపక్షాల సహకరాంతో ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఐదేళ్లు ప్రతిపక్షనాయకురాలిగా ఉన్న సోనియా తర్వాత 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ను విజయతీరాలకు చేర్చారు. తల్లి నుంచి అధ్యక్ష వారసత్వాన్ని అందుకున్న రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు అదే తీరులో సాగుతున్నారు. అననుకూల పరిస్థితుల్లో పార్టీ పగ్గాలు స్వీకరించి రికార్డు స్థాయిలో 19 ఏళ్లు కాంగ్రెస్ రాజకీయాలను శాసించిన సోనియా బాటనే రాహుల్ మార్గదర్శకత్వంగా భావిస్తున్నట్టు కనిపిస్తోంది.
తల్లిలానే రాహుల్ కూడా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి బళ్లారి నుంచి ప్రచారం ప్రారంభించారు. ఈ ఉదయం బళ్లారి సమీపంలో విమానం దిగిన రాహుల్ డూ ఆర్ డై పేరుతో ప్రచారబరిలోకి దిగారు. కర్నాటకలో ఏప్రిల్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో ఎలాగైనా అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని భావిస్తున్న రాహుల్ గాంధీ విస్తృత ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. తొలివిడతగా మూడు రోజుల పాటు రాహుల్ కర్నాటకలో ప్రచారం చేయనున్నారు. రోడ్ షోలు, సభలు, సమావేశాల ద్వారా రాహుల్ ప్రచారం సాగనుంది. గుజరాత్ లోలానే కర్నాటకలోనూ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ దేవాలయాలు, దర్గాలు సందర్శించనున్నారు. కొప్పాల్ లోని హులిగమ్మ దేవాలయం, గావి సిద్ధేశ్వర మఠం, కల్బుర్గిలోని ఖ్వాజా బండే నవాజ్ దర్గాను రాహుల్ వెళ్లనున్నారు.