Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశంలో ఓ పక్క మోడీ హవా సాగుతోంటే మరో పక్క కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి మాత్రం అంతా ఎదురుగాలులే వీస్తున్నాయి. మొన్నటికి మొన్న గుజరాత్ లోని వరద ప్రాంతాలకు వెళ్లిన రాహుల్ గాంధీ కారుపై రాళ్ల దాడి జరిగింది. బనాస్ కాంఠా జిల్లా ధానేరా పట్టణంలో ఆయన కారుపై రాళ్లు విసరడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. అంతకుముందు లాల్ చౌక్ సభలో ఆయన ప్రసంగిస్తుంటే కొందరు వ్యక్తులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. దీంతో అసౌకర్యానికి గురైన రాహుల్ అర్ధాంతరంగా ప్రసంగాన్ని ముగించి స్టేజీ దిగి వెళ్లిపోయారు. సరే గుజరాత్ అంటే మోడీ సొంతరాష్రం. కాబట్టి ఇలాంటి నిరసనలు సహజమనుకోవచ్చు. మరి ఉత్తరప్రదేశ్. ఇప్పుడు కాకపోయినా ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. అయితే మొత్తం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రాభవం కోల్పోయినా…ఇప్పటికీ అమేథీ, రాయబరేలీ నియోజక వర్గాలు రాహుల్ గాంధీ కుటుంబానికి కంచుకోటలాంటివి. రాహుల్ ప్రస్తుతం అమేథీ నుంచే లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి చోట రాహుల్ కు చేదు అనుభవం ఎదురయింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కనపడటం లేదని, ఆయన ఆచూకీ తెలిపితే రివార్డు ఇస్తామని అమేధీలో పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లు ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో కలకలం సృష్టిస్తున్నాయి. పోస్టర్లలో ఇంతటితో వదిలిపెట్టలేదు. రాహుల్ గాంధీ నియోజకవర్గానికి వచ్చి ఆర్నెల్లు అవుతోందని, ఆయన తీరు అమేథీ ప్రజలను అవమాన పరిచేలా ఉందని పోస్టర్లో ప్రచురించారు. ఎంపీ ల్యాడ్స్ కింద జరగాల్సిన అభివృద్ధి పనులూ మందగించాయని పోస్టర్లలో విమర్శించారు. గౌరీజంగ్ ప్రాంతంలో వెలసిన ఈ పోస్టర్లతో కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అమేథీ ప్రజలంతా రాహుల్ గాంధీ వైపే ఉన్నారని, కావాలనే బీజేపీ ఈ పోస్టర్లను ప్రచురించిందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించటంతో ఇక అమేథీ, రాయబరేలీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు అమిత్ షా, మోడీ పథక రచన చేశారని దానిలో భాగంగానే ఇలాంటి పోస్టర్లు వెలిశాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బీజేపీ ఎన్ని వ్యూహాలు రచించినా అమేథీ ప్రజల మనసు మార్చలేదని వారు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ప్రత్యర్థుల విమర్శలకు అవకాశం లేకుండా రాహుల్ గాంధీ అమథీకి తరచూ వస్తూ ఉండాలని కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని వార్తలు: