Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాను ఈ మధ్య ఎక్కువగా ప్రధాని మోడీని విమర్శించడానికే ఉపయోగిస్తున్నారు. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి అంశాన్ని మోడీకి ముడిపెడుతూ ట్వీట్లు చేస్తున్న రాహుల్ గాంధీ… తాజాగా అంతర్జాతీయ సంబంధాల విషయంలో ప్రధానిపై ట్విట్టర్ లో వ్యంగాస్త్రాలు విసిరారు. పాకిస్థాన్ తో తమ సంబంధాలు మెరుగుపర్చుకుంటున్నట్టు ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించినప్పుడు…మోడీ, ట్రంప్ ఆలింగనాన్ని ప్రస్తావిస్తూ రాహుల్… మోడీ గారూ త్వరపడండి. అధ్యక్షుడు ట్రంప్ కు మరో ఆలింగనం అవసరం ఉన్నట్టు కనిపిస్తోంది అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
తాజాగా మరో రెండు అంతర్జాతీయ విషయాలను ప్రస్తావిస్తూ కూడా రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ముంబై పేలుళ్ల సూత్రధారి, ఉగ్రవాద సంస్థ జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్ పది నెలల గృహ నిర్భంధం తర్వాత గురువారం అర్ధరాత్రి విడుదలయ్యాడు. అటు పాకిస్థాన్ తో సంబంధాల విషయమై అమెరికా మరో కీలక ప్రకటన చేసింది. లష్కరే తోయిబా నుంచి హఖ్ఖానీ నెట్ వర్క్ ను వేరుచేసేందుకు పాకిస్థాన్, ఆఫ్ఘన్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. ఈ రెండు విషయాలను ప్రస్తావించిన రాహుల్ నరేంద్రభాయ్ మాటలు కాదు..చేతలు కావాలని అని సూచించారు. ముంబై ఉగ్రదాడి సూత్రధారి బయటకు వచ్చాడు. లష్కరే నుంచి పాక్ మిలటరీ ఫండింగ్ ను ట్రంప్ వేరు చేశారు. ఆలింగనాల ప్రక్రియ విఫలమైంది..అర్జెంటుగా మరిన్ని ఆలింగనాలు కావాలి అని ట్వీట్ చేశారు.