Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా పరువు నిలబెట్టుకుంది కాంగ్రెస్. ఇక ఆ పార్టీకి కొత్తగా సారధ్య బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీకి కూడా పోరాట వీరుడనే గౌరవం దక్కించిన ఫలితం అది. అదే ఊపు కొనసాగించడానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పుడు మఠాలు, పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయా అని ఆరా తీస్తున్నాడు. వాటిని ఓ చుట్టు చుట్టడానికి రెడీ అవుతున్నాడు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితానికి , మఠాలు చుట్టూ తిరగడానికి లింక్ ఏంటి అనుకుంటున్నారా ? అక్కడికే వస్తున్నాం.
2019 సార్వత్రిక ఎన్నికలపై దృష్టిపెట్టిన రాహుల్ ఈ లోపే కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకి కాదు అన్న సందేశం ఇవ్వాలని గట్టిగా భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి అది ముస్లిం , క్రైస్తవ అనుకూల పార్టీ అన్న బీజేపీ ప్రచారం కారణమని 10 జన్ పథ్ భావిస్తోంది. ఆ ఇమేజ్ చట్రం నుంచి బయటపడితే గానీ వచ్చే ఎన్నికల్లో గెలవలేమని రాహుల్ కి తెలుసు. అందుకే గుజరాత్ ఎన్నికల సమయంలో తాను శివభక్తుణ్ణి అని చెప్పుకున్న రాహుల్ అక్కడ ఎన్నికల ప్రచారం సందర్భంగా వివిధ ఆలయాలు సందర్శించారు. ఆ ప్రభావం గుజరాత్ ఎన్నికల్లో ఎంతోకొంత సానుకూలత తెప్పించిందని భావిస్తున్న రాహుల్ టీం రానున్న ఎన్నికల్లోనూ అదే వ్యూహాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకో సారి బీజేపీ ,కాంగ్రెస్ హోరాహోరీ తలపడుతున్నాయి. అక్కడ శైవ ప్రభావం ఎక్కువ. మఠాలు,పీఠాలు కూడా ఎక్కువే. అందుకే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో సాధ్యమైనంత ఎక్కువగా మఠాలు,పీఠాలు దర్శించే విధంగా రాహుల్ పర్యటన మార్గాన్ని ఖరారు చేస్తున్నారు. ఈ ట్రిప్ లో ప్రచారంతో పాటు ఆయా మఠాలు,పీఠాలు రాహుల్ సందర్శిస్తారు. కర్ణాటకలోని ప్రముఖ శృంగేరి పీఠ దర్శనంతో ఆయన ప్రచార పర్వం మొదలయ్యే అవకాశం ఉందట. మొత్తానికి ముల్లుని ముల్లుతోనే తీయాలనే ఓ పాత సామెత ని వ్యూహంగా మార్చుకుని హిందూ కార్డు ప్రయోగిస్తున్న బీజేపీ కి అదే హిందుత్వతో జవాబు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు రాహుల్