రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై న్యాయస్థానం పర్యవేక్షణలో విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తమకు ఎలాంటి అనుమానాలు గోచరించడం లేదని, దీనిపై విచారణ చేపట్టాల్సిన అవసరం లేదన్న సుప్రీంకోర్టు, పిటిషన్లను కొట్టివేసింది. సుప్రీం తీర్పుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. రఫేల్ ఒప్పందంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, ఇవాళ సత్యం గెలిచిందని ఆయన చెప్పుకొచ్చారు.
ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేశారని, రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలను ప్రచారం చేశారని, అలాంటి వారికి సుప్రీం తీర్పు చెంపపెట్టు లాంటిదని అమిత్షా అన్నారు. అబద్దపు ప్రచారాలతో దేశ భద్రతను ప్రమాదంలో నెట్టాలని చూశారాని, ఈ విషయంలో ప్రజలకు, సైన్యానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని అమిత్షా డిమాండ్ చేశారు. అందరు దొంగలూ ఏకమై కాపాలదారుడైన ప్రధానినే దొంగ అంటున్నారని, వీరి వ్యాఖ్యలను దేశ ప్రజలు నమ్మరని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రఫేల్ విషయంలో తప్పుడు ఆరోపణనలతో రాహుల్ తన పరువు తానే పొగొట్టుకున్నారని ఎద్దేవా చేశారు.