Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాంగ్రెస్ లో కొత్త శకం ప్రారంభమైంది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. 19 ఏళ్ల సుదీర్ఘకాలం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగిన సోనియాగాంధీ పార్టీ నేతలు, కుటుంబ సభ్యుల సమక్షంలో కుమారుడికి పార్టీ పగ్గాలు అప్పగించారు. నెహ్రూ గాంధీ కుటుంబంనుంచి కాంగ్రెస్ అధ్యక్షబాద్యతలు చేపట్టిన ఆరో వ్యక్తి రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ ఏకగ్రీవంగా ఎన్నికయిన ధృవీకరణ పత్రాన్ని సోనియా సమక్షంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం అధ్యక్షుడు రామచంద్రన్ యువనేతకు అందించారు. మాజీ ప్రధాని మన్మోహన్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ సహా పలువురు సీనియర్ నేతలు రాహుల్ ను అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తూ సంతకాలు చేశారు. యువరాజు పట్టాభిషేకానికి సోదరి ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రఘువీరారెడ్డి, జేడీ శీలం, పల్లంరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోనియాగాంధీ మాట్లాడారు. రాహుల్ గాంధీకి అభినందనలు తెలియజేస్తున్నానని, ఆయన సారథ్యంలో పార్టీ మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నానని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో చివరిసారి మాట్లాడుతున్నానని, రాహుల్ సామర్థ్యంపై తనకు పూర్తి విశ్వాసముందని ఆమె వ్యాఖ్యానించారు. రాహుల్ లో శాంతి, సహనశీలత ఎక్కువన్నారు. 20 ఏళ్ల క్రితం కాంగ్రెస్ అధ్యక్షబాధ్యతలు తాను స్వీకరించిన సందర్బాన్ని గుర్తుచేసుకున్నారు. రాజీవ్ గాంధీతో పెళ్లి తరువాతే తనకు రాజకీయాలు పరిచయమయ్యాయని, గాంధీ కుటుంబం అద్భుతమైనదని ఆమె కొనియాడారు. ఇందిరాగాంధీ తనను కన్నబిడ్డలా చూసుకున్నారని, దేశం కోసం తమ కుటుంబం జైలుకు వెళ్లిందని చెప్పారు. ఇందిర, తన భర్త రాజీవ్ హత్యల తరువాత కుంగిపోయానని, రాజకీయాల నుంచి తన కుటుంబాన్ని పక్కన పెట్టాలని భావించానని అన్నారు.
కాంగ్రెస్ బలహీనపడుతున్న సందర్భంలో కార్యకర్తల విజ్ఞప్తి మేరకు తాను బాధ్యతల్ని స్వీకరించాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సోనియాగాంధీ నాయకత్వ సామర్థ్యాన్ని కొనియాడారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా 19ఏళ్లు సేవలందించారని, శక్తిమంతమైన నాయకురాలిగా నిలిచారని ప్రశంసించారు. కాంగ్రెస్ హయాంలో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని, తమ పాలనలో అభివృద్ధి రేటు ఏడాదికి సగటున 7.8శాతంగా ఉందన్నారు. కాగా, రాహుల్ కాంగ్రెస్ పగ్గాలు చేపడుతున్న సందర్భంగా ఏఐసీసీ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. కార్యాలయ ప్రాంగణం రాహుల్ చిత్రపటాలతో నిండిపోయింది. ఆ ప్రాంగణమంతా రాహుల్ రాహుల్ నినాదాలతో హోరెత్తిపోయింది. టపాసులు కాలుస్తూ, మిఠాయిలు పంచుకుంటూ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.