Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రధాని మోడీకి సొంతగడ్డ గుజరాత్ లో ఊహించని పోటీ ఎదురైంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీ గెలుపు నల్లేరు మీద నడక అన్నంత తేలిగ్గా చెప్పేసాయి. కానీ అవి చెప్పినంత తేలిగ్గా లేదు పరిస్థితి. ప్రధాని మోడీకి తొలిసారిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెమటలు పెట్టించారు. చివరకు ఎన్నికల సమయంలో పార్టీని గట్టెక్కిస్తాడని మోడీ ఎన్నో నమ్మకం పెట్టుకున్న సీఎం విజయ్ రూపాని సైతం సొంత నియోజకవర్గం రాజకోట్ వెస్ట్ లో కొన్ని రౌండ్స్ లో వెనకబడిపోయారు. ఇక ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ కూడా మెహసానా నియోజకవర్గంలో వెనుకంజలో వున్నారు. ఇదొక్కటి చాలు గుజరాత్లో మోడీని రాహుల్ ఏ స్థాయిలో కంగారు పెట్టారో చెప్పడానికి.
ఎప్పుడూ ప్రత్యర్థులకు వణుకు పుట్టించే మోడీ ఈసారి తానే కంగారుపడ్డారు. అందుకే గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాకిస్తాన్ సైన్యం అహ్మద్ పటేల్ ని సీఎం చేయాలి అనుకుంటోందని చెప్పేదాకా వెళ్లారు. పటేల్ రిజర్వేషన్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ సెక్స్ సీడీ విడుదల వెనుక కూడా బీజేపీ హస్తం ఉందన్న వాదన బలంగా వినిపించింది. ఇవన్నీ చూసాక ఏ గుజరాత్ అభివృద్ధి అన్న నినాదంతో ఢిల్లీ గద్దెనెక్కిన మోడీకి ఆ రాష్ట్రంలోనే డిఫెన్స్ లో పడ్డారు. అక్కడ గెలుపు కోసం మోడీ ఏమి చేశారో చూసాక గెలుపు ఓటములతో సంబంధం లేకుండా రాహుల్ హీరోగా ఆవిర్భవించడం ఖాయంగా కనిపిస్తోంది.