Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయ నాయకుల ప్రసంగం అంటే ప్రజలకు ఎంతో ఆసక్తి ఉంటుంది. కొంత మంది నేతలు కేవలం ప్రసంగాల ద్వారానే ఎన్నికల్లో గెలిచిన సందర్బాలున్నాయి. అద్భుతరీతిలో ప్రసంగాలు చేస్తూ… కొందరు నేతలు ఎన్నికల సమయంలో ప్రజల మైండ్ సెట్ మార్చేసి అనూహ్యంగా గెలుపొందుతూ ఉంటారు. అప్పటికప్పుడు మాట్లాడేదయినా… ముందు రాసిపెట్టింది చదివేది అయినా ప్రసంగ సమయంలో నేతలు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడా తప్పులు దొర్లకుండా చూసుకుంటారు. ప్రసంగాల ద్వారా వ్యక్తిగత ఇమేజీని పెంచుకున్న నేతలెందరో దేశ రాజకీయాల్లో ఉన్నారు. అంతెందుకు గత సార్వత్రిక ఎన్నికల్లో మోడీ తన ప్రసంగాల ద్వారానే దేశమంతా పాపులరయ్యారు. కానీ ఆయన ప్రత్యర్థి, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి మాత్రం ప్రసంగాలపై అంత పట్టు లేదు. భారీ బహిరంగ సభల్లో సైతం ఎక్కువగా మాట్లాడని రాహుల్ …మైక్ ముందున్నంత సేపూ ఇబ్బందిగానే ఉన్నట్టు కనిపిస్తారు. ఆ క్రమంలోనే కొన్నిసార్లు తప్పులు మాట్లాడేస్తుంటారు.
గతంలో అయితే వీటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ…ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమాని ఇలాంటివే ఎక్కువగా ప్రజల నోళ్లల్లో నానుతున్నాయి. తాజాగా కర్నాటకలో రాహుల్ చేసిన ప్రసంగం ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాహుల్ గాంధీ ఇటీవల బెంగళూరులో ఇందిరా క్యాంటిన్లు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇందిరా క్యాంటిన్స్ అనబోయి పొరపాటున అమ్మ క్యాంటిన్స్ అన్నారు. అరగంట పాటు సాగిన ఈ ప్రసంగమంతా తప్పుల తడకలే. ఇందిరా క్యాంటిన్లు కర్నాటకలోని అన్ని నగరాల్లో ప్రారంభిస్తాము అనటానికి బదులుగా బెంగళూరులోని ప్రతి నగరంలో అన్నారు. క్యాంటిన్లకు బదులు క్యాంపెయిన్లు అని కూడా పొరపాటున పలికన రాహుల్ గాంధీ ప్రసంగంపై నెటిజన్లు కామెంట్లు గుప్పిస్తున్నారు. నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయంగా ఎదగటం సంగతి పక్కనపెట్టి…ముందు తన ప్రసంగాలను మెరుగుపర్చుకోవాలని సూచిస్తున్నారు. రాహుల్ గాంధీ కుటుంబం ప్రసంగాలకు ప్రజాదరణ ఎంతగానో ఉంటుంది. దేశ ప్రథమ ప్రధాని నెహ్రూ ప్రసంగిస్తుంటే ప్రజలు ఆసాంతం కదలకుండాకూర్చుని తిలకించేవారు. ఇక ఇందిరాగాంధీ ప్రసంగించటానికి వస్తుంటేనే ప్రజల్లో ఉత్తేజం నెలకొనేది. రాజీవ్ గాంధీ ప్రసంగాలూ ప్రజలను బాగానే ఆకట్టుకునేవి. వారి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న రాహుల్… వారి ప్రసంగపాటవాలను మాత్రం అలవర్చుకోలేకపోయారు.
మరిన్ని వార్తలు: