Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణం చేయడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది ప్రజాస్వామ్య ఓటమిగా రాహుల్ అభివర్ణించారు. ఉదయం బీజేపీ విజయోత్సవాలను జరుపుకుంటోంటే భారతావని ప్రజాస్వామయ్యం ఖూనీ కావడాన్ని చూసి మౌనం పాటిస్తోందని ట్విట్టర్ లో విమర్శించారు. భారత రాజ్యాంగాన్ని బీజేపీ అపహాస్యం చేసిందని రాహుల్ నిప్పులు చెరిగారు. మెజారిటీకి అవసరమైన సంఖ్యాబలం లేనప్పటికీ… బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిందని, ఇది బీజేపీ అహేతుకమైన పట్టుదలని రాహుల్ మండిపడ్డారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా బీజేపీపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటుచేసేటంత మెజార్టీ లేకపోయినప్పటికీ… రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని, ఈ అంశంపై తాము ప్రజల్లోకి వెళ్తామని, బీజేపీ దారుణ రాజకీయాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు.
యడ్యూరప్ప తన మెజారిటీ నిరూపించుకోవాలనుకుంటే… ముందు 112 మంది ఎమ్మెల్యేల పేర్లను వెల్లడించాలని సవాల్ విసిరారు. అటు బీజేపీపై కాంగ్రెస్, చేస్తున్న విమర్శలపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పందించారు. కర్నాటకలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంచేస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వస్తున్న ఆరోపణలపై ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు అమిత్ షా… కర్నాటకలో ప్రజాతీర్పు ఎవరికి ఉంది? బీజేపీ 104 సీట్లు గెలుచుకుంది. లేదా కాంగ్రెస్ 78 సీట్లకు పడిపోయింది. ఆ పార్టీ సీఎం, మంత్రులు కూడా భారీ మార్జిన్లతో ఓటమి పాలయ్యారు. జేడీఎస్ కేవలం 37 సీట్లలోనే గెలుపొందింది. పలు సీట్లలో డిపాజిట్లు కూడా కోల్పోయింది. ప్రజలు అర్థం చేసుకోగలరు అని అమిత్ షా ట్వీట్ చేశారు.