2019లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్ధి ఎవరు ? మూడో క్లాసు పిల్లాడు కూడా టక్కున చెప్పే పేరు రాహుల్ గాంధీ. ఇదే విషయాన్ని ఆయనే స్వయంగా కొన్ని సార్లు బయటపెట్టుకున్నాడు కూడా. కానీ తెలుగు బిగ్ బాస్ 2 ట్యాగ్ లైన్ లా ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు అనే విధంగా ఉండే కాంగ్రెస్ మాత్రం ఏకంగా దాని అధ్యక్ష్యుడికే షాక్ ఇచ్చింది. అదేంటి అంటారా ఈ స్టోరీ చదవండి మీకే తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని 2019లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రచారం చేయబోమని ఆ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు.
కాకపోతే ఆయన చెప్పిన లాజిక్ కూడా బాగానే ఉంది అదేంటంటే ప్రధాని అభ్యర్థిని ఎన్నికలకు ముందు పేరు ప్రకటించకుండా గతంలో చాలా మంది ప్రధానులు అయ్యారట, అదే కోవలో ఈసారి కూడా అదే సూత్రాన్ని వర్తింపజేస్తామని చెప్పుకొచ్చారు. మరి రాహుల్ ఏమైనా ఫీల్ అవుతాడు అనుకున్నాడో ఏమో రాహుల్ గాంధీతో సహా వేరే ఎవరినీ కూడా ప్రధాన మంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకటించబోమని చిదంబరం చెప్పుకొచ్చారు. ఈరోజు ఒక జాతీయ మీడియాకి చెందిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీజేపీని చెక్ పెట్టేందుకు ప్రాంతీయ పార్టీలతో కూటమిని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, అలాంటి సంకీర్ణ కూటమికి నాయకత్వం వహించవచ్చని అయితే వారి నుంచి వచ్చే స్పందన మిశ్రమంగా ఉందన్నారు. ఓహో ఇదన్న మాట విషయం మొన్న చత్తీసుగఢ్ ఎన్నికల్లో మాయ కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చేసరికి చిదంబరం ఈ విధంగా చెప్పుకోచ్చారన్నమాట.
అలాగే ఆయన మాట్లాడుతూ మా మొదటి లక్ష్యం బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి రాకూడదు. ఇందుకోసం కూటమి ఏర్పడాలని, ఇక రెండవది ఎన్నికల అనంతరం ప్రధాని అభ్యర్థి. కూటమి భాగస్వామ్య పక్షాలు కలిసి కూర్చొని చర్చించి ప్రధాని ఎవరనేది తేలుస్తారని చెప్పుకొచ్చారు. జాతీయ పార్టీల ఓట్లను ప్రాంతీయ పార్టీలు లాగేసుకుంటున్నాయని, కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఓట్ షేరింగ్ 50 శాతం కన్నా తక్కువకు పడిపోయిందని కాంగ్రెస్‌తో చేతులు కలిపే ప్రాంతీయ పార్టీలను మోదీ ప్రభుత్వం భయపెడుతోంది ఆయన ఆరోపించారు. మొట్టంకి కాంగ్రెస్ పరిస్థితి కర్ణాటకలో లాగా అయితే ఈ సారి పీఎం అయ్యే కుమారస్వామి ఎవరో మరి ! వేచి చూడక తప్పుతుందా ?