Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నాలుగేళ్లలో సీన్ మారిపోయింది. ఏ గుజరాత్ నుంచి అయితే మోడీ దండయాత్ర మొదలయ్యిందో అదే గడ్డ మీద విజయం కోసం ఆయన చెమటోడ్చాల్సి వచ్చింది. గుజరాత్ ఎన్నికల్లో రాహుల్ ఓడి గెలిస్తే, మోడీ గెలిచి ఓడిపోయాడు. ఈ విషయం జనానికి మాత్రమే కాదు బీజేపీ నేతలు, శ్రేణులతో పాటు మోడీ ,అమిత్ షా ద్వయానికి కూడా బాగా అర్ధం అయ్యింది. 150 స్థానాల్లో గెలుస్తాం అని ఆర్భాటంగా ప్రకటించిన షా వచ్చిన ఫలితాలు చూసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. వచ్చిన 99 స్థానాల్లో పది అటు ఇటు అయ్యుంటే ఏమి జరిగేదో కమలనాథులకు తెలియంది కాదు. బీజేపీ యోధానుయోధులంతా గుజరాత్ బరిలో దిగి ప్రచారాన్ని హోరెత్తించారు.ఇక మోడీ అయితే పాకిస్తాన్ పేరు చెప్పి గుజరాతీలను భయపెట్టారు. అయినా వీసమెత్తు తేడా. తృటిలో తప్పిన ఈ ప్రమాదాన్ని చూసి ఆంతరంగిక సమావేశాల్లో బీజేపీలోని మోడీ వ్యతిరేకులు అయ్యయ్యో అనుకుంటున్నారు.
2019 మాత్రమే కాదు మోడీ వున్నంతకాలం బీజేపీ లో నోరు ఎత్తలేమని డీలాపడ్డ బీజేపీ నేతలకు గుజరాత్ ఫలితాలు కొత్త ఉత్సాహం ఇచ్చాయి. ఒకప్పుడు ఇవే రాష్ట్ర ఎన్నికలు తమ నోటికి తాళం వేసిన విషయం వారికి గుర్తుకు వస్తోంది. ఇప్పుడు ఆ తాళాలు తీసేసి స్వేచ్చగా మాట్లాడే రోజు దగ్గర్లోనే ఉందని వాళ్ళు భావిస్తున్నారు. మొత్తానికి ఏ అంచనాలు లేకుండా గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాహుల్ అక్కడ చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించారు.కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాక తొలి ఎన్నికల్లో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా స్వపక్షం , విపక్షంలోని వాళ్ళ చేత కూడా సెహ్ బాష్ అనిపించుకున్నారు. ఈ ఎన్నికల ప్రభావం 2019 మీద ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే చెప్పలేం. మోడీ దీన్ని ఓ గుణపాఠంగా తీసుకుంటే ఓ రకంగా లేక ఘన విజయం అనుకుంటే ఇంకో రకంగా ఈ ఎన్నికల ప్రభావం ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం ఈ ఫలితాలు చూసి ఎవరూ రాహుల్ ని పప్పు అనరు. మోడీ ని సింహం అని అంతకన్నా అనలేరు.