కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలే ఎంపీ పదవిపై అనర్హత వేటు పడితే..మళ్ళీ దాన్ని తొలగించడంతో ఎంపీగా లోక్ సభలో అడుగుపెట్టిన రాహుల్..అవిశ్వాస తీర్మానంపై మాట్లాడుతూ..బిజేపిపై విరుచుకుపడ్డారు. మొదట తనని ఎంపీగా పునర్నియమించినందుకు స్పీకర్‌కు ధన్యవాదాలు చెప్పారు.
హృదయంతో మాట్లాడతానని చెప్పి..భారత్ జోడో యాత్ర గురించి కాసేపు చెప్పారు. తర్వాత మణిపూర్ అంశంపై స్పందించారు. మణిపూర్ లో తాను పర్యటించానని, కుమారుల మృతదేహాల వద్ద ఉన్న తల్లులతో మాట్లాడానని, భయానక సంఘటనల గురించి చెప్పేటపుడు ఆ మహిళలు స్పృహ కోల్పోయారని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రం ఆ రాష్ట్రంలో పర్యటించలేదని, బీజేపీ ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించారన్నారు. అక్కడ మహిళలని హత్య చేయడం ద్వారా…భారత మాతను హత్య చేశారని ఆరోపించారు.బీజేపీ నేతలు దేశభక్తులు కాదని, దేశ ద్రోహులు అని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలతో బిజేపి సభ్యులు..రాహుల్ పై ఫైర్ అయ్యారు.
అదే సమయంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. అవినీతి, వారసత్వ రాజకీయాలు భారత దేశాన్ని విడిచిపెట్టిపోవాలన్నారు. అయితే స్మృతి ఇరానీ మాట్లాడుతుండగానే రాహుల్ గాంధీ లోక్ సభ నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయారు. ఇక ఆయన సభ నుంచి వెళ్లిపోతూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని స్మృతి ఇరానీ ఆరోపించారు. కానీ ఎక్కడ కూడా కెమెరాల్లో కనిపించలేదు. దీంతో అధికారులు సిసిటివి ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. మొత్తానికి రాహుల్ మరొకసారి వివాదంలో ఇరుక్కున్నారు.