కర్ణాటకలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ రానున్న ఐదు రాష్ట్రాల్లోనూ గెలుపు కేతనం ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న హస్తం పార్టీ.. మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నాల్లో ఉంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా గహ్లోత్ సర్కార్ భారీ హామీలను ప్రకటించింది.
మళ్లీ కాంగ్రెస్‌ను గెలిపిస్తే రాష్ట్రంలో 500 రూపాయలకే వంట గ్యాస్ నూ దాదాపు కోటి ఐదు లక్షల కుటుంబాలకు సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రకటించారు. అలాగే, కుటుంబ పెద్దగా ఉన్న మహిళకు ఏడాదికి 10వేలు రూపాయలును గౌరవ వేతనంగా ఇస్తామన్నారు. బుధవారం ఝున్‌ఝునులో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ హామీలను ప్రకటించారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ఎంపిక చేసిన కొందరు పారిశ్రామికవేత్తల కోసమే కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది తప్ప.. ప్రజా సమస్యల్ని పట్టించుకోవడంలేదని విమర్శించారు. మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు కలిగిన రాజస్థాన్ శాసనసభకు నవంబర్ 25న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.