Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమరావతి డిజైన్ల తుదిరూపులో టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి సలహాలు తీసుకోవాలని చంద్రబాబు సీఆర్ డీఏ అధికారులను ఆదేశించినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ అయింది. చంద్రబాబుపైనా… రాజమౌళిపైనా వైసీపీ అధినేత జగన్ అనుకూల మీడియాలో ఎన్నో రకాలుగా వార్తలొస్తున్నాయి. ఫేస్ బుక్, వాట్సప్ ల్లో అనేకమంది పేరడీలు ప్రచారం చేస్తున్నారు. నవ్యాంధ్ర నిర్మాణంలో దేశంలో పేరుగాంచిన డైరెక్టర్లందరి సలహాలూ చంద్రబాబు తీసుకుంటారని ఆయన వ్యతిరేకులు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రపంచ ఫ్రఖ్యాతి గాంచిన నార్మల్ ఫోస్టర్ డిజైన్ల కన్నా… రాజమౌళి అట్టముక్కలతో వేయించే భారీ సెట్టింగులే చంద్రబాబుకు బాగా నచ్చుతాయని విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమరావతి నిర్మాణ సలహాదారు, రూపశిల్పి, పర్యవేక్షకుడిగా రాజమౌళిని నియమించారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై రాజమౌళి ట్విట్టర్ లో స్పందించారు. ఈ వార్తలో నిజం లేదని ఆయన స్పష్టంచేశారు. అంతేకాదు… నవ్యాంధ్ర డిజైన్ల రూపకల్పనలో తన పాత్ర ఏమిటి అన్నదానిపైనా రాజమౌళి క్లారిటీ ఇచ్చారు.
భవనాల నిర్మాణ ప్రక్రియ వేగవంతం కావడానికి చంద్రబాబు విజన్ ను… ఫోస్టర్, వారి భాగస్వామ్యులకు వివరించే బాధ్యత మాత్రమే తనదని రాజమౌళి వెల్లడించారు. చారిత్రక ప్రాజెక్టులో తన వంతు కృషి, సహాయం చాలా చిన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫోస్టర్ నవ్యాంధ్ర కోసం రూపొందించిన డిజైన్లన్నీ చాలా బాగున్నాయని ఆయన ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన బృందం ఆ డిజైన్లతో సంతృప్తిగా ఉన్నారని, అయితే అసెంబ్లీ భవన డిజైన్ మరింత అద్భుతంగా ఉంటే బాగుండేదని మాత్రమే ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారని రాజమౌళి ట్విట్టర్ లో వెల్లడించారు. రాజమౌళి ఇచ్చిన ఈ స్పష్టమైన వివరణ తర్వాతైనా… రాజధాని నిర్మాణంలో ఆయన పాత్ర ఏమిటో జగన్ అనుకూలురుకు అర్దమయితే అంతే చాలు.