బాలీవుడ్ నటులను సంప్రదిస్తున్న రాజమౌళి

బాలీవుడ్ నటులను సంప్రదిస్తున్న రాజమౌళి

బాహుబలితో రాజమౌళి బ్రాండ్‌ ఇండియా వైడ్‌ పాపులర్‌ అయినా కానీ ఈసారి తన సినిమాకి బాలీవుడ్‌ తారలు లేకుండా పాన్‌ ఇండియా అప్పీల్‌ రాదని అతనే భయపడ్డాడు. అందుకే తీసేది తెలుగు స్టార్లతో మల్టీస్టారర్‌ అయినా కానీ హిందీ తారలని కూడా తన సినిమాలో పెట్టుకున్నాడు. అదే ఇప్పుడు రాజమౌళి ప్లానింగ్‌ని దెబ్బ కొడుతోంది. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ షూటింగ్‌ ఆలస్యం కావడానికి కారణం బాలీవుడ్‌ నటులేనట.

ఆలియా భట్‌ యమ బిజీగా వుండడంతో ఆమె డేట్లు అసలు దొరకడం లేదు. దాంతో ఆమె రోల్‌ని కూడా కుదించినట్టు చెబుతున్నారు. ఇక అజయ్‌ దేవ్‌గణ్‌ అయితే తన హిందీ చిత్రాలతో బిజీగా వున్నాడు. హిందీ చిత్రాలని పక్కన పెట్టి దీనికి అతను డేట్స్‌ ఇవ్వడం లేదు. దీనివల్ల అతని కోసం వచ్చే జనవరి వరకు వేచి చూడక తప్పదు. తెలుగు హీరోలంటే రాజమౌళి పేరు చెబితే ఏదంటే అది చేసేస్తారు కానీ బాలీవుడ్‌ తారలు మాత్రం అతడిని తెలుగు దర్శకుడిగానే చూస్తున్నారు.

అతని సినిమాని కూడా రీజనల్‌ సినిమాగానే పరిగణిస్తూ తమకి అనుకూలమైన టైమ్‌లోనే డేట్స్‌ ఇస్తున్నారు. దీని వల్ల ఆర్‌.ఆర్‌.ఆర్‌. ఏడాదికి పైగా ఆలస్యం కానుందని చెబుతున్నారు. రాజమౌళి సినిమాలేవీ అనుకున్న సమయానికి పూర్తి కావు కానీ ఈసారి పకడ్బందీ వ్యూహంతో వెళ్లాడు. అయినప్పటికీ బాలీవుడ్‌ నటుల రూపంలో అతని ప్రణాళిక మొత్తం రివర్స్‌ అయిపోయింది.