టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి చిత్రం తర్వాత తెరకెక్కబోతున్న చిత్రం మల్టీస్టారర్ అనే విషయం అందరికి తెల్సిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసి నటించబోతున్న ఈ మల్టీస్టారర్ చిత్రం కోసం దాదాపు ఆరు నెలలుగా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఇంకా కూడా స్క్రిప్ట్‌ను తయారు చేసే పనిలోనే దర్శకుడు రాజమౌళి ఉన్నట్లుగా తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు ఈ చిత్రాన్ని నవంబర్‌లో ప్రారంభించాలని రాజమౌళి భావించాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాను మరింత ఆలస్యంగా ప్రారంభించాలని నిర్ణయించారు. పూర్తిగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయిన తర్వాత మాత్రమే సినిమాను సెట్స్‌పైకి తీసుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌తో పాటు, మరో వైపు సెట్స్ నిర్మాణం కూడా జరుగుతుంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న అల్యూమీనియం ఫ్యాక్టరీలో ఈ చిత్రంకు సంబంధించిన సెట్స్‌ను నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మెజార్టీ పార్ట్ ఆ సెట్స్‌లోనే చిత్రీకరించబోతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రాన్ని నవంబర్ నుండి కాకుండా జనవరి నుండి సెట్స్ పైకి తీసుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 2019 జనవరిలో చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకు వెళ్లి 2020వ సంవత్సరం వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. అతి త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంతా భావించారు. సంక్రాంతి తర్వాత సినిమాను ప్రారంభించాలని జక్కన్న భావించిన తరుణంలో ఇప్పట్లో సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దానయ్య నిర్మించబోతున్న విషయం తెల్సిందే