రజినీకాంత్‌ 23 ఏళ్ల తర్వాత రెండుతో..!

Rajinikanth Repeating A Feat After 23 Years

1990 కాలంలో స్టార్‌ హీరోలు, చిన్న హీరోలు ఇలా అంతా కూడా సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలు చేసేవారు. కొందరు అరడజనుకు పైగా చిత్రాలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. తెలుగు హీరోలు మాత్రమే కాకుండా తమిళ హీరోలు కూడా సినిమాల సంఖ్య భారీగా తగ్గించారు. సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ గత 23 సంవత్సరాలుగా. సంవత్సరానికి కేవలం ఒక్కటి మాత్రమే చిత్రాన్ని చేస్తూ వస్తున్నాడు. గతంలో సంవత్సరంలో లెక్కకు మించి చిత్రాలు చేసిన రజినీకాంత్‌ పరిస్థితుల ప్రభావంతో 23 సంవత్సరాలుగా కేవలం సంవత్సరానికి ఒకే చిత్రాన్ని విడుదల చేస్తూ వస్తున్నాడు. అయితే ఈ సంవత్సరం మాత్రం రజినీకాంత్‌ నటించిన రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

1995లో ముత్తు మరియు భాష చిత్రాలు విడుదల అయ్యాయి. ఆ సంవత్సరం తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఒక్కో చిత్రం చొప్పునే విడుదల అయ్యాయి. కొన్ని సంవత్సరాలు అసలు సినిమాలే విడుదల కాలేదు. అలాంటిది ఈ సంవత్సరం వేసవిలో ‘కాలా’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన రజినీకాంత్‌ దీపావళి కానుకగా అంటే నవంబర్‌లో ‘2.0’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. దాదాపు సంవత్సర కాలంగా విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ‘2.0’ చిత్రాన్ని ఎట్టకేలకు నవంబర్‌లో విడుదల చేయాలని నిర్ణయించారు. 2018లో రజినీకాంత్‌ నటించిన రెండు చిత్రాలు విడుదల కాబోతున్నాయని, ఇది 23 సంవత్సరాల తర్వాత జరుగుతుంది అంటూ తమిళ మీడియాలో పతాక స్థాయిలో కథనాలు వస్తున్నాయి. రజినీకాంత్‌, శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘2.0’ చిత్రం నవంబర్‌లో విడుదల ఖాయం అంటూ ప్రకటించారు. అయితే ఆ తేదీ మళ్లీ మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ నవంబర్‌లో విడుదల కాకుంటే 23 ఏళ్ల రికార్డు రజినీది కొనసాగుతూ వస్తుంది.