Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భగత్ సింగ్ పేరు వింటే… ఎవరికైనా ఉత్తేజం కలుగుతుంది. ఆయన గురించి తెలుసుకునేకొద్దీ… ఉడుకురక్తం ఉప్పొంగుతుంది. ఆయన జీవితం, పోరాటమే కాదు… ఆయన మరణమూ ఓ పాఠమే. దేశం కోసం నవ్వుతూ ఉరికంబం ఎక్కిన ఆ ధీరోదాత్తుడి జీవితం భవిష్యత్ తరాలకు ఎన్ని సందేశాలు అందించిందో . చప్పగా సాగుతున్న స్వాతంత్య్ర పోరాటంలో విప్లవ జ్వాలలు రగిలించిన భగత్ సింగ్ స్ఫూర్తి ఎన్ని తరాలు గడిచినా… మాసిపోదు. ఇక ఆయన పుట్టిపెరిగిన ప్రదేశాలు, పోరాటాలు జరిపిన స్థలాలు, ఆయన మరణించిన ప్రాంతం చూస్తే… కలిగే ఫీలింగ్ మాటల్లో చెప్పలేం. ఆ ప్రాంతాలను చూడగానే ఓ రకమైన భావోద్వేగం కలుగుతుంది. ప్రస్తుతం దర్శకదిగ్గజం రాజమౌళి ఈ అనుభూతిలోనే ఉన్నారు.
ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కోసం పాకిస్థాన్ వెళ్లిన రాజమౌళి తన పర్యటనలో భాగంగా భగత్ సింగ్ ను ఉరితీసిన ప్రదేశాన్ని సందర్శించారు. బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు, బ్రిటిష్ హైకమిషనర్ సాండర్స్ ను కాల్చి చంపడం, ఢిల్లీ అసెంబ్లీలో బాంబు దాడి కేసుల్లో 1931 మార్చి 23న బ్రిటిష్ ప్రభుత్వం లాహోర్ లోని షాద్మన్ చౌక్ ప్రాంతంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను ఉరితీసింది. ఆ ప్రాంతాన్ని సందర్శించిన రాజమౌళి ట్విట్టర్ లో ఓ ఫొటో పోస్ట్ చేశారు. నాడు బ్రిటిష్ వాళ్లు భగత్ సింగ్ ను ఉరితీసిన లాహోర్ లోని షాద్మన్ చౌక్ ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని చూస్తోంటే రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి అని రాజమౌళి ట్వీట్ చేశారు. రాజమౌళే కాదు… పాకిస్థాన్ వెళ్లే చాలా మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించి భగత్ సింగ్ స్మతులను గుర్తుచేసుకుంటారు.