ఆ అసెంబ్లీ లో నిజంగానే దెయ్యాలున్నాయా ?

Rajasthan MLAs fear assembly Haunted By Evil Spirits

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
దేశ‌రాజకీయాల్లో దెయ్యాలు ప్ర‌వేశించాయి. విన‌డానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. దెయ్యాలు ఉన్నాయ‌ని ఓ రాజ‌కీయ‌నేత ఇల్లు ఖాళీ చేయ‌డం, దెయ్యాలపై అసెంబ్లీలో చ‌ర్చ జ‌ర‌గ‌డం వంటి ప‌రిణామాలు ప్ర‌జ‌లంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తున్నాయి. నిజానికి దెయ్యాలనేవి ఉండ‌వ‌ని ఓ ప‌క్క హేతువాదులు గొంతు చించుకుంటున్నారు. దెయ్యం, ఆత్మ వంటి మూఢ‌నమ్మ‌కాలు విడ‌నాడాల‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు ప్రాతినిధ్యం వ‌హించే ప్ర‌జాప్ర‌తినిధులు కూడా ఇలాంటి విష‌యాల్లో చైత‌న్య‌వంతంగా ఉండాలి. ప్ర‌జ‌ల్లో ఉన్న మూఢ‌న‌మ్మ‌కాల్ని తొల‌గించే ప్ర‌య‌త్నంచేయాలి. కానీ మ‌న నేత‌లు అందుకు భిన్నంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. వారే స్వ‌యంగా దెయ్యం, ఆత్మ‌వంటి వాటిని న‌మ్ముతూ భ‌యాందోళ‌న‌కు గురవుతూ, హాస్యాస్ప‌దంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

మొన్న‌టికి మొన్న బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ త‌న‌యుడు, మాజీ మంత్రి తేజ్ ప్ర‌తాప్ తాను మంత్రిగా ఉన్న‌ప్పుడు నివ‌సించిన బంగ్లా ఖాళీచేసి వెళ్తూ ఆ బంగ్లాలో ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ దెయ్యాలు వ‌దిలివెళ్లారు అని ఆరోపించ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది. మాజీ మంత్రి హోదాలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. ఈ గొడ‌వ స‌ద్దుమ‌ణ‌గ‌క‌ముందే సాక్షాత్తూ రాజ‌స్థాన్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు దెయ్యాల గురించి భ‌య‌ప‌డ‌డం న‌వ్వు తెప్పిస్తోంది. ఇంత‌కీ అసెంబ్లీలో దెయ్యాలున్నాయ‌ని ఎమ్మెల్యేలు భ‌య‌ప‌డ‌డానికి కార‌ణం ఈ ప్రాంగ‌ణం లోప‌ల కొంత భాగంలో ఒక‌ప్పుడు శ్మ‌శాన వాటిక ఉండ‌డమే. శ్మ‌శాన‌వాటిక‌పై అసెంబ్లీని నిర్మించ‌డం వ‌ల్లే… దెయ్యాల ప్ర‌భావంతో గ‌త ఆరు నెల‌ల్లో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు మ‌ర‌ణించార‌న్న‌ది పలువురు నేత‌లు భ‌యం. రెండురోజుల క్రితం బీజేపీ

ఎమ్మెల్యే హ‌బీబుర్ రెహ్మాన్ అసెంబ్లీలో మాట్లాడుతూ… శాస‌న స‌భ‌లో దెయ్యాలు ఉండ‌వ‌చ్చ‌నే అనుమానాన్ని వ్య‌క్తంచేశారు. ఆయ‌న మాట‌ల‌తో కొంద‌రు ఎమ్మెల్యేలు ఏకీభ‌వించారు. అసెంబ్లీ స‌మావేశాలు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌లోపు ముగించాల‌ని, శుద్ధి కార్య‌క్ర‌మాల‌ను జ‌రిపించాల‌ని స్పీక‌ర్ ను కోరారు. ఈ నేప‌థ్యంలో దీనిపై ఓ విచార‌ణ క‌మిటీ వేయాల‌ని ప్ర‌భుత్వ చీఫ్ విప్ కాలులాల్ గుర్జ‌ర్ స‌ర‌దాగా వ్యాఖ్యానించారు. అయితే ఎమ్మెల్యేల భ‌యాల‌ను అసెంబ్లీ సెక్ర‌ట‌రీ ఖండించారు. తాను ఎన్నోసార్లు పనిమీద అసెంబ్లీ ప్రాంగ‌ణంలో అర్ధ‌రాత్రి వ‌ర‌కూ గ‌డిపాన‌ని, త‌న‌కు ఎలాంటి దెయ్యాలూ క‌నిపించ‌లేద‌ని స్ప‌ష్టంచేశారు. రాజ‌స్థాన్ అసెంబ్లీ భ‌వ‌నాన్ని జ్యోతిన‌గ‌ర్ లో దాదాపు 16.96 ఎక‌రాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ కాంప్లెక్స్ ను ఆనుకుని లాల్ కోఠి శ్మ‌శాన‌వాటిక ఉంది. అయిన‌ప్ప‌టికీ నేత‌లు ఇలా దెయ్యాలు ఉన్నాయ‌ని న‌మ్మ‌డం, సాక్షాత్తూ అసెంబ్లీలో దీనిపై చ‌ర్చించ‌డంపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.