Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేసి ఆమె మృతదేహాన్ని అత్యంత క్రూరంగా 70 ముక్కలు చేసిన ఓ భర్తకు ఉత్తరాఖండ్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ దారుణ ఘటన 2010లో జరిగింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన రాజేశ్ భార్య అనుపమను ఏడేళ్ల క్రితం కిరాతకంగా హతమార్చాడు. 1999లో రాజేశ్, అనుపమ వివాహం జరిగింది. ఆ తర్వాత వారు అమెరికా వెళ్లారు. తొమ్మిదేళ్ల తర్వాత 2008లో డెహ్రాడూన్ తిరిగివచ్చారు. అప్పటినుంచి వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. కోల్ కతా కు చెందిన ఓ మహిళతో రాజేశ్ కు ఉన్న వివాహేతర బంధం తెలిసి అనుపమ అతన్ని నిలదీయటంతో గొడవలు మొదలయ్యాయి. 2010 నాటికి ఆ గొడవలు ముదిరాయి. చివరకు అక్టోబరు 17న రాత్రి వేళ ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. దీంతో సహనం కోల్పోయిన రాజేశ్ ఆమెను హత్యచేశాడు. అనంతరం అనుపమ మృతదేహాన్ని 70 ముక్కలుగా నరికాడు. వాటన్నింటిని పాలిథిన్ కవర్లలో ఉంచి డీప్ ఫ్రిజ్ లో పెట్టాడు. రోజుకో కవర్ను తీసుకువెళ్లి బయట పారేయటం మొదలుపెట్టాడు. అలా నగరంలోని అనేక ప్రాంతాల్లో ఆ కవర్లను పడేశాడు. అనుపమ కనిపించకపోవటంతో ఆమె సోదరుడు డిసెంబరు 12న పోలీసులకు ఫిర్యాదుచేశాడు. పోలీసులు రాజేశ్ ఇంట్లో సోదాలు చేయటంతో ఈ దారుణం వెలుగులోకొచ్చింది. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉన్నత విద్యావంతుడైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నొటోరియస్ క్రిమినల్ లా ప్రవర్తించటం అందరినీ నివ్వెరపరిచింది. ఏడేళ్లపాటు సాగిన విచారణ అనంతరం ఉత్తరాఖండ్ కోర్టు రాజేశ్ కు యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
మరిన్ని వార్తలు: