జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ‘పోరాట యాత్ర’ నేడు తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో జన సైనికుల కవాతుకు పార్టీ ఏర్పాట్లు చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రిలోని పిచ్చుకలంక నుంచి కాటన్ విగ్రహం వరకూ 2.5 కిలోమీటర్ల మేర ఈ కవాతు సాగనుందని ప్రకటించింది. అయితే ‘జనసేన కవాతు’కు రాజ మహేంద్రవరం పోలీసులు మోకాలడ్డారు. ఈ కవాతుకు అనుమతిని నిరాకరిస్తూ నోటీసులు జారీచేశారు.
కవాతు నిర్వహించేందుకు ధవలేశ్వరం బ్యారేజీ అనుకూలంగా లేదని పోలీసులు అందులో పేర్కొన్నారు. ఇక్కడి పిట్ట గోడలు బలహీనంగా ఉన్నాయని అందులో వెల్లడించారు. ఈ రోజు యాత్రకు దాదాపు 3 లక్షల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశముందనీ, కాబట్టి అనుమతి ఇవ్వలేమని తేల్చిచెప్పారు. అయితే పవన్ ప్రసంగించే స్థలంలో 10,000 మంది మాత్రమే సరిపోతారనీ, అంతకుమించి ప్రజలు హాజరైతే తొక్కిసలాట చోటుచేసుకునే ప్రమాదముందని పోలీసులు నోటీసులో హెచ్చరించారు. కాబట్టి బహిరంగ సభ కోసం మరో ప్రాంతాన్ని చూసుకోవాలని సూచించారు.