మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. యావత్ ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి వల్ల దినసరి కార్మికుల జీవనశైలి తీవ్రంగా దెబ్బతింటోంది. సినిమా పరిశ్రమలో దినసరి వేతనాలు తీసుకునే చిన్న కార్మికుల సంఖ్య ఎక్కువే ఉంటుంది. షూటింగులు, ప్రీ ప్రొడక్షన్ మరియు పోస్ట్ ప్రొడక్షన్, ఈవెంట్లు అన్ని రకాల కార్యక్రమాలు వాయిదా పడడంతో సిని కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సందర్భంలో కొంతమంది హీరోలు వారికి అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు.
కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందిపడుతున్న సినికార్మికులకు రూ. 50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించి మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ‘ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఫెప్సీ)’ సంస్థకు రజనీకాంత్ 50 లక్షల విరాళం ప్రకటించారు. అలాగే తమిళ హీరో విజయ్ సేతుపతి కూడా రూ.10 లక్షల విరాళంగా ఇచ్చారు. హీరో శివకార్తికేయన్ రూ.20 లక్షల విరాళం ప్రకటించారు. ఇందులో రూ.10 లక్షల నగదును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్లు అయన తెలిపారు. మిగిలిన రూ.10 లక్షలను సహాయక వస్తువుల రూపేనా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. హీరోలు సూర్య, కార్తి కలిపి రూ.10 లక్షలు ఫెప్సికి విరాళంగా ఇచ్చారు.