Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జయలలిత మరణం తర్వాత రోజుకో మలుపు తిరుగుతున్న తమిళ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఏళ్ల తరబడి సాగుతున్న ఉత్కంఠకు తలైవా మరికొన్ని రోజుల్లో తెరదించనున్నారు. ఆయన రాజకీయ ప్రవేశం దాదాపుగా ఖరారయినట్టే. రాజకీయాల్లోకి వచ్చే ముందే తనకున్న లక్ష్యాన్ని కూడా ఆయన పరోక్షంగా ప్రకటించారు. యుద్ధంలోకి దిగితే గెలిచేతీరాలన్న ఉద్దేశాన్ని స్పష్టంచేశారు. దీనిప్రకారం వచ్చే ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పదవి చేపట్టడమే ఆయన నిర్దేశించుకున్న లక్ష్యంగా కనిపిస్తోంది. చెన్నైలోని రాఘవేంద్ర మండపంలో అభిమానులతో సమావేశమైన రజనీకాంత్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
రజనీ రాజకీయప్రవేశానికి సన్నాహక సమావేశాలుగా భావిస్తున్న ఈ మీట్ అండ్ గ్రీట్ ఇవాళ్టి నుంచి ఆరు రోజుల పాటు జరగనున్నాయి. రోజుకు వెయ్యిమంది అభిమానుల్ని రజనీ ఈ సమావేశాల్లో కలుస్తారు. చివరిరోజు డిసెంబరు 31న రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేయనున్నారు. తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పడం లేదని, డిసెంబరు 31న నిర్ణయం ప్రకటిస్తానని మాత్రమే అంటున్నానని వ్యాఖ్యానించిన రజనీ..తన రాజకీయ ప్రవేశంపై కన్ఫూజన్ ను ఆ రోజు వరకు కొనసాగిస్తున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సమావేశంలో మాత్రం కాస్త స్పష్టంగానే తన అభిప్రాయాలు వ్యక్తంచేశారు తలైవా. దేవుడు శాసిస్తే రాజకీయాల్లోకి వస్తానని, అయితే ఈ విషయంలో తాను తీసుకునే నిర్ణయం ప్రజలకు ఎంత వరకు మేలు చేస్తుందన్నది బాగా ఆలోచించాలని అభిప్రాయపడ్డారు. రాజకీయాలు తనకు కొత్త కాదని, 1996 నుంచి చూస్తూనే ఉన్నానని, కాకపోతే కాస్త ఆలస్యమయిందంతే అని వ్యాఖ్యానించడం ద్వారా తాను రాజకీయాల్లోకి వచ్చేస్తున్నానని పరోక్షంగా తేల్చిచెప్పారు.
అలాగే రాజకీయ ప్రవేశం తర్వాత తన భవిష్యత్తుపై ఆయన ఎంతో విశ్వాసంతో ఉన్నారు. ఎన్నికల్లోకి రావడం అంటే విజయం సాధించినట్టేనన్న ఆయన వ్యాఖ్యలు దీనికి ఉదాహరణ. ఆయనే చెప్పినట్టు 1996 నుంచి రాజకీయాల్లోకి ఆయన రావాలన్న చర్చ జరుగుతున్నా ఆ దిశగా అడుగులు వేయకపోవడానికి కారణం యుద్ధంగా భావించే ఎన్నికల్లో గెలవగలనా లేదా అన్న మీమాంస ఉండడం వల్లే. కొన్ని నెలల క్రితం కమల్ హాసన్ తో కలిసి పాల్గొన్న ఓ కార్యక్రమంలో రజనీ ఈ తరహా అభిప్రాయమే వ్యక్తంచేశారు కూడా. శివాజీగణేశన్ ను ఆదర్శంగా తీసుకునే రజనీ..రాజకీయాల్లో ఆయనకు ఎదురయిన అనుభవమే తనకూ కలుగుతుందన్న భయంలో కూడా ఉన్నారు. సినిమాల్లో ఉన్నతస్థాయిలో ఉన్నప్పుడే రాజకీయాల్లో ప్రవేశించి సొంత పార్టీ పెట్టిన శివాజీ గణేశన్..సొంత నియోజకవర్గంలో కూడా గెలవలేకపోయారని, దీని ద్వారా సినిమా నటులకు ఆయన ఓ పాఠం నేర్పి వెళ్లారని రజనీ ఆ సమావేశంలో చెప్పుకొచ్చారు.
శివాజీగణేశన్ కు ఎదురయిన ఓటమితో పాటు…2004 లోక్ సభ ఎన్నికల్లో తాను చెప్పినప్పటికీ అన్నాడీఎంకెకు ఓట్లు పడకపోవడం, 2009 ఎన్నికల్లో పొరుగురాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టి ఘోరవైఫల్యం చెందడం రజనీకాంత్ ను పునరాలోచలో పడేశాయి. కానీ తర్వాతి కాలంలో దేశరాజకీయాల్లో వచ్చిన మార్పులతో పాటు జయలలిత మరణంతో తమిళ రాజకీయాల్లో ఏర్పడ్డ శూన్యత రజనీలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తుండడం కూడా రజనీకి స్పూర్తి కలిగిస్తోంది. ఈ పరిణామాలు తాను మరో శివాజీగణేశన్ కాకుండా, ఎంజీఆర్, ఎన్టీఆర్ కాగలనన్న నమ్మకాన్ని తలైవాలో పెంచాయనడానికి ఆయన తాజా అడుగులే ఉదాహరణ.