సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్లో బిగ్గెస్ట్ సక్సెస్ చిత్రం అయిన ‘భాషా’కు సీక్వెల్ చేయాలని పలువురు దర్శకులు ప్రయత్నాలు చేశారు. ఇటీవలే సాయి రమణి అనే దర్శకుడు ‘భాషా’ చిత్రానికి ఒక మంచి సీక్వెల్ స్క్రిఫ్ట్‌ను రెడీ చేశాడు. ఆ స్క్రిప్ట్ విన్న రజినీకాంత్ బాగుందని అన్నాడట. అయితే ఆ చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచన లేదని చెప్పాడట. కథ బాగుందని, మీ స్క్రీన్‌ప్లే స్టైల్ నచ్చిందని చెప్పన రజినీకాంత్ ‘భాషా’ వంటి సినిమాను మళ్లీ తనకు చేయాలని లేదని, ఒకవేళ ఫలితం తారు మారు అయితే ఒక మంచి సినిమాను నాశనం చేసిన వాళ్లం అవుతాం అంటూ దర్శకుడితో రజినీకాంత్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అదే కథతో మరో హీరోను తీసుకుని సినిమా చేస్తే అది ‘భాషా’కు సీక్వెల్ అవ్వదని, ప్రేక్షకులు భాషను దృష్టిలో పెట్టుకుని ఆ చిత్రాన్ని చూడరు అంటూ రజినీకాంత్ సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
‘భాషా’ సీక్వెల్‌పై ఆసక్తి లేదు కాని, మంచి స్క్రిప్ట్‌తో వస్తే తప్పకుండా మీ దర్శకత్వంలో సినిమా చేస్తాను అంటూ రజినీకాంత్ దర్శకుడు సాయి రమణితో చెప్పినట్లుగా తెలుస్తోంది. ‘మొట్ట శివ కట్ట శివ’ చిత్రాన్ని చేసిన దర్శకుడు సాయి త్వరలోనే రజినీకాంత్‌తో సినిమాను చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం రజినీకాంత్‌తో సినిమాను చేసేందుకు స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నట్లుగా సాయి రమణి చెప్పుకొచ్చాడు. త్వరలోనే రజినీకాంత్‌ను కలిసి కథను చెప్పబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. 2020 వరకు రజినీకాంత్‌తో సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తానంటూ సాయి రమణి ధీమా వ్యక్తం చేశాడు. గతంలోనే రజినీకాంత్‌తో సినిమా చేసే అవకాశం వచ్చినా కూడా అప్పట్లో రజినీకాంత్ ఆరోగ్యం సరిగా లేని కారణంగా ఆ అవకాశంను సాయి రమణి కోల్పోయాడు.