అరవింద సమేత బిజినెస్‌ అదుర్స్‌

Aravinda Sametha Creates Record in Pre Release Business

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అరవింద సమేత’ చిత్రం దసరాకు విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. త్రివిక్రమ్‌ గత చిత్రం ‘అజ్ఞాతవాసి’ అట్టర్‌ ఫ్లాప్‌ అయినా కూడా ఆయనపై నమ్మకంతో నిర్మాత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆయన పెట్టుకున్న నమ్మకంనే డిస్ట్రిబ్యూటర్లు కూడా పెట్టుకుంటున్నారు. అన్ని ఏరియాల్లో కలిపి ఈ చిత్రాన్ని ఏకంగా 75 కోట్లకు కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వస్తున్నారు. ఒక్క ఆంధ్రా ఏరియాలోనే ఈ చిత్రంను 40 కోట్లకు పైగా కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇక నైజాం ఏరియాలో ఈ చిత్రం 20 కోట్లకు పైగా బిజినెస్‌ చేసే అవకాశం కనిపిస్తుంది.

స్టార్‌ హీరో చిత్రం అంటే 60 నుండి 70 కోట్ల ప్రీ రిలీజ్‌ చేయడం చాలా కామన్‌ అయ్యింది. అయితే ఎన్టీఆర్‌ సినిమాకు మాత్రం ఏకంగా 75 కోట్ల వరకు అమ్ముడు పోయే అవకాశం కనిపిస్తుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ జులై నెలతో పూర్తి అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు. భారీ ఎత్తున యాక్షన్‌ సన్నివేశాలతో పాటు, మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా ఈ చిత్రంలో ఉంటుందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌ లేదా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఐటెం సాంగ్‌ చేసే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసేందుకు దర్శకుడు త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం సినిమాకు అన్ని ఏరియాల నుండి డిస్ట్రిబ్యూటర్లు భారీ ఎత్తున కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అన్ని రైట్స్‌ కలిపి కనీసం 100 కోట్లు అయినా నిర్మాత ఖాతాలో పడే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.