Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తనవెనక బీజేపీ ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ తోసిపుచ్చారు. హిమాలయాల పర్యటన ముగించుకుని చెన్నై చేరుకున్న రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు. తన వెనక బీజేపీ ఉందని కొందరు ఆరోపిస్తున్నారని, కానీ తన వెనక దేవుడు ఉన్నాడని, ఆ తర్వాత ప్రజలున్నారని, తనను ఎన్ని ప్రశ్నలు వేసినా… రాజకీయ ప్రయాణంలో ఇదే తన సమాధానమని తలైవా స్పష్టంచేశారు. పెరియార్ విగ్రహం కూల్చివేతపైనా రజనీ స్పందించారు. దీనిని తాను ఖండిస్తున్నానని, ఇటువంటి అనాగరిక ఘటన జరగకుండా ఉండాల్సిందని రజనీ వ్యాఖ్యానించారు. హిమాలయాల యాత్ర చాలా ప్రశాంతంగా జరిగిందని, తనకు కొత్త శక్తినిచ్చిందని చెప్పారు.
హిమాలయాల పర్యటన ముగియడంతో రజనీ పార్టీ వివరాలు ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తమిళనాడు కొత్త ఏడాది సందర్భంగా ఏప్రిల్ 14న రజనీ పార్టీ వివరాలు ప్రకటించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. దీనిపై రజనీకాంత్ క్లారిటీ ఇవ్వకపోవడంతో మరింత సమయం పట్టే సూచనలూ కనిపిస్తున్నాయి. హిమాలయాల పర్యటనకు వెళ్లినప్పుడు రజనీ బీజేపీ కార్యకర్తలను కలిశారని, ఆయన బీజేపీలో చేరనున్నారని వార్తలు రావడంతో పర్యటన ముగియగానే. తలైవా… క్లారిటీ ఇచ్చారు. కాగా, రజనీ చెన్నై రాక సందర్భంగా ట్విట్టర్ లో వెల్ కం బ్యాక్ పీపుల్స్ సీఎం రజనీ అన్న హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉండడం విశేషం.