Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళనాడు అంతా ఆ నోటినుంచి ఏ మాట వస్తుందా అని ఎదురు చూస్తున్న సమయం ఇది. ఇంతకీ ఆయన సూపర్ స్టార్ రజని కాంత్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొత్త పార్టీ గురించి రజని ప్రకటన ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న తన అభిమానులకి సంతోషం కలిగించే ఓ మాట చెప్పాడు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో రాజకీయాల గురించి కొందరు విలేకరులు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ అందులోకి రానని చెప్పడం లేదుగా అని ఎదురు ప్రశ్న వేశారు. అంతే కాదు రాజకీయ ప్రవేశం గురించి చర్చలు జరుగుతున్నాయి కాబట్టి అవి పూర్తి అయ్యాక ఓ ప్రకటన చేస్తానని కూడా రజని చెప్పారు. తాజా స్టేట్ మెంట్ చూస్తే రాజకీయాల విషయంలో ఔనననకపోయినా కాదనడం లేదన్నట్టు వుంది రజని తీరు.
కిందటి నెలలో చెన్నై లో అభిమానులతో సమావేశం అయిన రజని “యుద్ధం వస్తే మాతృభూమి పరిరక్షణకు మీరంతా వస్తారని తెలుసు. ప్రస్తుతానికి అందరం మన పనుల్లో నిమగ్నమవుదాం. ఒకవేళ అవసరం అనుకున్నప్పుడు ముందుకు నడుద్దాం”. అంటూ కీలక సందేశం ఇచ్చారు. ఆ ప్రకటనతోనే ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఖాయం అయిపోయింది. కానీ అదెప్పుడు… ఎవరితో కలిసి అడుగులు వేస్తారు అన్నదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. దానికి సమాధానం ఆగష్టు 15 లేదా అక్టోబర్ లో ఉండొచ్చని సమాచారం.