Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత్ – చైనా మధ్య పరిస్థితులు అంతకంతకూ దిగజారుతూ యుద్ధం తప్పదని ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత హోం మంత్రి రాజనాథ్ సింగ్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. రెండు దేశాల మధ్య ప్రతిష్టంభనగా మారిన డోక్లామ్ సరిహద్దు సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని రాజ్ నాథ్ అన్నారు. ఈ విషయంలో చైనా సానుకూల నిర్ణయం తీసుకుంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు. భారత్ శాంతిని కోరుకుంటోందని పొరుగు దేశాలన్నింటికి సందేశం పంపుతామని చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఇండో టిబెట్ సరిహద్దు బలగాలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
సరిహద్దులో భారత భద్రతా బలగాలు ఎంతో సమర్థతో పనిచేస్తున్నాయని, సరిహద్దును కాపాడే విషయంలో భద్రతా బలగాలకు అన్ని అధికారాలు ఉన్నాయని స్పష్టంచేశారు. ఇప్పుడే కాదు… గతంలోనూ భారత్ డోక్లామ్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని పలుమార్లు చైనాను కోరింది. కానీ చైనా మాత్రం మొండి పట్టు వీడడం లేదు. డోక్లామ్ సరిహద్దు నుంచి భారత్ తన సైన్యాన్ని ఉపసంహరించాల్సిందే అని డిమాండ్ చేస్తోంది.
చైనా మీడియా కూడా రోజూ భారత్ ను రెచ్చగొట్టేలా వార్తలు ప్రచురిస్తోంది. చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ లో యుద్ధం తప్పదన్నట్టు పరోక్ష హెచ్చరికలు చేస్తూ వార్తలొస్తున్నాయి. అది చాలదన్నట్టు సోషల్ మీడియాలోనూ భారత్ పై దుష్ప్రచారం సాగిస్తోంది. చైనా ఇలా విషం కక్కుతున్నా… భారత్ మాత్రం హుందాగానే బదులిస్తోంది. యుద్ధం వస్తే ఎదుర్కోవటానికి సన్నధ్ధంగా ఉంటూనే శాంతియుత మార్గాల్లో సమస్య పరిష్కరించుకునేందుకు ఎదురుచూస్తోంది. చైనా వైఖరిలో మార్పు వస్తుందని ఆశిస్తోంది. మరి భారత్ కోరుకుంటున్నగా డ్రాగన్ దేశం వ్యవహరిస్తుందా లేదా అన్నది చూడాలి.
మరిన్ని వార్తలు: