ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రజనీకాంత్‌

ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రజనీకాంత్‌

ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రజనీకాంత్‌పై చర్యలకు చెన్నై పోలీసులను ఆదేశించాలంటూ ‘ద్రావిడర్‌ విడుదలై కళగం’ వేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. దీనిపై మేజిస్ట్రేట్‌ కోర్టుకు వెళ్లకుండా హైకోర్టుకు రావాల్సిన అవసరమేంటని కోర్టు ప్రశ్నించింది. ఇటీవల చెన్నైలో జరిగిన తుగ్లక్ పత్రిక 50వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ..1971లో సేలంలో నిర్వహించిన ఓ ర్యాలీని గుర్తు చేశారు.

అప్పట్లో పెరియార్‌ సీతా రాముల ప్రతిమలను నగ్నంగా తీసుకెళ్లారని రజనీ వ్యాఖ్యానించారు.ఇది అప్పట్లో బయటకు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తపడిందని పేర్కొన్నారు. దీనిపై ద్రావిడర్‌ విడుదలై కళగం నేతలు రజనీ తన వ్యాఖ్యలతో పెరియార్ గౌరవ ప్రతిష్ఠకు భంగం కలిగించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కళగం అధ్యక్షుడు కొళత్తూర్‌ మణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెరియార్‌ను కించపరిచిన రజనీకాంత్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ద్రావిడర్‌ విడుదలై మణి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో డిమాండ్ చేశారు. కాగా ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

రజినీ వ్యాఖ్యలను డీఎంకే తప్పుపట్టగా, డీవీకే జనవరి 18న ట్రిప్లికేన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.అయితే, ఎఫ్ఐఆర్‌ నమోదుకు కానీ, ఫిర్యాదు చేసినట్టు రిసిప్ట్ ఇచ్చేందుకు కానీ పోలీసు అధికారులు నిరాకరించినట్టు ఆ సంస్థ చెన్నై జిల్లా కార్యదర్శి ఉమాపతి తెలిపారు. ఈ నేపథ్యంలో హైకోర్టును డీవీకే ఆశ్రయించింది. మతం పేరుతో తమిళనాడు ప్రజల మధ్య శత్రుత్వాన్ని పెంచేందుకు, అశాంతిని రెచ్చగొట్టేందుకు రజినీ ప్రయత్నించారంటూ పిటిషన్‌లో ఆరోపించింది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదుకు పోలీసులను ఆదేశించాలని కోర్టును కోరింది.