Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనసేన పోరాట యాత్ర పేరుతో జనాల్లోకి వెళ్ళిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఏపీలోని అన్ని నియోజకవర్గాల నుంచి జనసేన పోటీ చేస్తుందని ఆయన ప్రకటించిన ఆయన దానికి తగ్గట్టే అన్ని నియోజకవర్గాలను కలుపుకుంటూ తన యాత్ర ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటి వరకూ పవన్ ఫ్యామిలీ నుంచి అడపాదడపా నాగబాబు తప్ప మిగిలిన వాళ్లు ఎవరూ జనసేన గురించి పెద్దగా మాట్లాడిన సందర్భాలు లేవు. అయితే ప్రజారాజ్యం పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేసేసి ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుడిగా చెలామణీ అవుతున్న చిరంజీవి అయితే అసలు జనసేన అనేది ఒకటి ఉంది అని గుర్తించినట్టే కనపడరు. కాంగ్రెస్ ని మిగతా నాయకులని విమర్శించే పవన్ అన్నను మాత్రం పల్లెత్తు మాట అనరు దీంతో అన్నయ్య, తమ్ముడు ఎప్పటికైనా ఒక్కటవుతారన్న ఆశ మాత్రం మెగాభిమానుల్లో ఉంది. అయితే ఆ ఊహలకి ఊపిరి పోసేలా కళ్యాణ్ బాబాయ్ పిలిస్తే జనసేన తరఫున ప్రచారానికి తాను సిద్ధంగా ఉన్నానని మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ స్పష్టం చేశారు. రిటైల్ మొబైల్ స్టోర్స్ సంస్థ ‘హ్యాపీ మొబైల్స్’కు రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు.
ఈ సందర్భంగా ఆ సంస్థ గురువారం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ అమ్మాయి ‘సినిమా స్టార్లు పొలిటికల్ క్యాంపెయిన్‌లో పాల్గొంటున్నారు. మీ క్యాపెయిన్ ఎలా ఉండబోతోంది?’ అని అడిగింది. దీనికి సమాధానం ఇస్తూ… ‘ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రచారం చేద్దామనుకున్నా. కానీ నీకింకా సమయముంది అప్పటి వరకు వెయిట్ చెయ్ అని కళ్యాణ్ బాబాయ్ చెప్పాడు. మా అవసరం ఆయనకున్నప్పుడు మేమంతా ఆయనకు భరోసాగా నిలుస్తాం. ఆయన పిలుపిచ్చినప్పుడు ఒక సెకెన్ కూడా ఆలోచించకుండా నేను వెళ్లి క్యాంపెయిన్ చేస్తాను. అయితే నేను ప్రచారం చేయొచ్చని ఆయనకి అనిపించాలి. ఆయన సూచనలు మేం ఎప్పుడూ పాటిస్తామని రామ్ చరణ్ చెప్పారు.
అయితే దీని పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తునారు. మెగా అభిమానులకి ఈ వార్త సంతోషకరం కావడంతో వారు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ప్రజారాజ్యం టైం లో యువరాజ్యం అంటూ తెలుగు రాష్ట్రాల్లో రైలు యాత్ర చేసిన చరణ్ ఇప్పుడు అసలు ప్రచారం చేద్దామనుకుంటే బాబాయ్ వద్దన్నాడని కబుర్లు చెబుతున్నారని సోషల్ మీడియాలో మరో వర్గం వాదిస్తోంది. అయితే ఇప్పుడు తన తండ్రి ఉన్న కాంగ్రెస్ కి ప్రచారం చేస్తా అని చెప్పని చెర్రీ బాబాయ్ కి అండగా ఉంటానని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.