వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ‘ఆఫీసర్’ చిత్రంతో అట్టర్ ఫ్లాప్ అయిన విషయం తెల్సిందే. స్వీయ దర్శకత్వంలో వర్మ ఆఫీసర్‌ను నిర్మించాడు. ఏమాత్రం ఆకట్టుకోని కథ, కథనంతో నాగార్జున కెరీర్లోనే చెత్త సినిమాగా నిలిచిన ఆఫీసర్ ఫ్లాప్ నుండి వర్మ అప్పుడే బయట పడ్డట్లుగా అనిపిస్తుంది. ఆఫీసర్ చిత్రం వచ్చి మూడు వారాలు అయ్యిందో లేదో అప్పుడే వర్మ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. అయితే ఈసారి వర్మ దర్శకత్వం వహించకుండా కేవం నిర్మిస్తున్నాడు. ప్రేమ, హింస నేపథ్యంలో వర్మ కొత్త సినిమా ఉండబోతుందని తాజాగా వర్మ విడుదల చేసిన స్టిల్స్‌ను చూస్తే అనిపిస్తుంది. వర్మ చాలా విభిన్నమైన కథ అంటూ చెబుతున్న ఈ చిత్రంను తెలుగులో ‘భైరవ గీత’ అనే టైటిల్‌తో విడుదల చేయబోతున్నారు.
ప్రేమ కోసం తన చుట్టు ఉన్న భూస్వామ్య వ్యవస్థను నాశనం చేసేందుకు ప్రయత్నించే ఒక వ్యక్తి కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లుగా వర్మ చెప్పుకొచ్చాడు. వర్మ దర్శకత్వం చేయకుండా ఈ సినిమా దర్శకత్వ బాధ్యతను కొత్త దర్శకుడు సిద్దార్థకు అప్పగించాడు. భాస్కర్ రాశి అనే నిర్మాతతో కలిసి వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. చాలా విభిన్నమైన చిత్రాలు అయితేనే వర్మ నిర్మాణంకు ముందుకు వస్తాడు. దర్శకుడు సిద్దార్థ్ ఈ చిత్రం కథతో వర్మను మెప్పించాడని, అందుకే వర్మ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయినట్లుగా తెలుస్తోంది. వర్మ చేయి వేయడంతోనే సినిమా స్థాయి అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఈ చిత్రం గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను జూన్ 21న విడుదల చేయబోతున్నట్లుగా వర్మ ప్రకటించాడు. టైటిల్‌తో ఆకట్టుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆఫీసర్ తర్వాత వర్మ చేస్తున్న ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనేది చూడాలి.