నాదెండ్ల మనోహర్ కొద్దిరోజులుగా అటు జనసేనలోనూ ఇటు ఏపీ రాజకీయాల్లోనూ ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఇది. రెండు నెలల క్రితం జనసేనలో చేరిన మనోహర్ అనతి కాలంలోనే పవన్ కుడి భుజంగా మారిపోయారు. ఈయన పార్టీలో చేరినప్పటి నుంచి ముందు నుంచీ ఉన్న నాయకులను కాదని, జనసేనాని మనోహర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ మధ్య బాగా టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి కరుడుగట్టిన కాంగ్రెస్ వాది అయిన మనోహర్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని అనతి కాలంలోనే గొప్ప నేతగా పేరు తెచ్చుకున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కీలక పదవులు కట్టబెట్టింది. అలాగే 2004, 2009 సార్వత్రిక ఎన్నికలలో గుంటూరు జిల్లా తెనాలి శాసనసభా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికయ్యారు. అంతేకాదు, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో శాసనసభ స్పీకర్‌గా కూడా పని చేశారు. అయితే, విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. మనోహర్ గురించి అనేక వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈయనను పలువురు టార్గెట్ చేయడం చర్చనీయాంశం అయింది. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నాదెండ్ల మనోహర్‌పై ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఎన్టీఆర్‌కు నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచినట్లు పవన్‌కు నాదెండ్ల మనోహర్ వెన్నుపోటు పొడుస్తాడేమోనని భయంగా ఉంది. పవన్ కల్యాణ్‌ను జాగ్రత్తగా ఉండమని ఫ్యాన్స్ అందరూ చెప్పడి. పవన్ కల్యాణ్ ఎంత సూపర్ స్టార్ అయినా.. వెన్నుపోటు నుంచి ఎన్టీఆర్ కూడా తప్పించుకోలేకపోయాడు. పీకే కూడా తప్పించుకోలేడు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ పవన్ కల్యాణ్ ముందు బిజీగా ఉంటే, వెనుక నుంచి నాదెండ్ల మనోహర్ వెన్నుపోటు పొడవాలని చూస్తున్నాడు. కోవర్ట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి నాకు సమాచారం ఉంది.
జనసేనలో ఉండే వాళ్లలో కొందరు నాదెండ్ల మనోహర్‌తో కలిసి పవన్‌కు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు. అందులో నాదెండ్ల కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు’’ అని కలకలం రేపాడు ఆర్జీవీ.అయితే ఈ ట్వీట్ పై సామజిక మాంద్యమాల్లో ఎప్పుడు కూడా ఆక్టివ్ గా ఉండే ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్ తనదైన శైలిలో స్పందించారు. ” నాదెండ్ల మనోహర్ గురించి రాంగోపాల్ వర్మ చెప్పింది నిజమే! పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు. పవన్ కళ్యాణ్ కూడా కసాయవాడిని నమ్మే…అదే!. కాకపోతే వర్మగారు అంత త్వరగా నిజాలు బయటికి చెప్పి ట్రూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనిపించారు. అది నాకు నచ్చలేదు. నాకన్నా పెద్ద ఫ్యాన్ పవన్‌కి ఎవరూ ఉండకూడదు. వర్మతో సహా…” అని కత్తి సెటైరికల్‌గా తన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. అయితే కత్తి ఇటీవల టీడీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ మంత్రి రావెల గురించి కూడా వ్యాఖ్యలు చేశాడు. ‘‘నాందేడ్ల మనోహర్‌లు, రావెల కిషోర్ బాబులు కాదు జనసేనని కాపాడేది. వాళ్ళు బెటర్ ఛాన్స్ లు వస్తే జంప్ అయిపోతారు. అదను చూసుకుని వెన్నుపోట్లు పొడిచేస్తారు. దిలీప్ సుంకర,విష్ణు నాగిరెడ్డి లాంటి పవన్ కళ్యాణ్ పిచ్చొళ్లే జనసేనకి రక్ష. వాళ్ళకి సరైన స్థానం కల్పించలేకపోతే పవన్ కళ్యాణ్ అంత లూజర్ మరొకరు ఉండరు’’ అంటూ పోస్టు చేశాడు. మొత్తానికి ఏ ఉద్దేశంతో వీళ్లిద్దరూ కామెంట్లు చేస్తున్నారో కానీ, గతంలో లేని విధంగా నాదెండ్ల మనోహర్ ఇప్పుడు హైలైట్ అవుతున్నారు.