Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
శ్రీదేవి హఠాన్మరణం, ఆ తర్వాతి పరిణామాలు ఆమె అభిమానులను ఎంత ఆవేదనకు గురిచేశాయో మాటల్లో చెప్పలేం. ఆమె మరణం సామాన్యులనే కాకుండా పలువురు సెలబ్రిటీలను ముఖ్యంగా ఆమె అభిమాని దర్శకుడు రాంగోపాల్ వర్మను ఎంతగానో కలిచివేసింది. శ్రీదేవి మరణం గురించి తెలిసిన దగ్గరనుంచి ఆయన సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో తన ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తాజాగా శ్రీదేవి అభిమానులకు నా ప్రేమలేఖ పేరుతో ఫేస్ బుక్ లో ఆయనో ఓ సంచలనాత్మక లేఖ రాశారు. శ్రీదేవి జీవితంలోని అనేక విషాదాలను ఆయన ఆ లేఖలో వెల్లడించారు. ఈ లేఖను బయటపెట్టాలా… వద్దా… అని తనలో తాను ఎంతగానో మధనపడ్డానని, అయితే ఎందరో అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి కేవలం ఒకరికి సొంతమైన వ్యక్తికాదని బలంగా నమ్మానని, ఆమె అభిమానులకు ఈ వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని వర్మ తన లేఖలో పేర్కొన్నారు. వర్మ తన లేఖలో ప్రస్తావించిన విషయాలివి.
శ్రీదేవి ఎంతో అందమైన, ఆకర్షణీయమైనమహిళ అని వేలాది మంది అభిమానులు నమ్మినట్టే నేను కూడా ఎప్పటికీ నమ్ముతాను. దేశంలోనే అతిపెద్ద సూపర్ స్టార్ గా, ప్రధాన హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ ని ఇరవై ఏళ్లపాటు ఆమె ఏలిన విషయం మనందరికీ తెలుసు. అదంతా ఆమె జీవితంలో ఓ భాగం మాత్రమే. శ్రీదేవి జీవితం మాదిరిగానే… ఆమె మరణం కూడా చాలా మిస్టీరియస్ గా ఉంది… సెలబ్రిటీల వాస్తవజీవితం బాహ్య ప్రపంచం ఊహించినదానికంటే భిన్నంగా ఉంటుంది. ఆ భిన్నమైన జీవితాల్లోకెల్లా శ్రీదేవి జీవితం ప్రత్యేకమైంది. శ్రీదేవి జీవితం అద్భుతంగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. ఎంతో అందం, గొప్ప ప్రతిభ, ఇద్దరు అందమైన కూతుళ్లతో కుదురుగా ఉన్న సంసారం… ఇవన్నీ బయటనుంచి చూసేవారికి ఆమె కోరుకున్నట్టుగానే జీవితం ఉందని అనిపించవచ్చు. కానీ నిజానికి శ్రీదేవి సంతోషంగా ఉంటూ సంతోషకరమైన జీవితం గడిపిందా..?
నేను తొలిసారి కలిసినప్పటి నుంచి శ్రీదేవి జీవితం నాకు తెలుసు. చాలా దగ్గరిగా ఆమెను చూశాను. తన తండ్రి ఉన్నంత కాలం పక్షిలా హాయిగా ఎగరడాన్ని చూశాను. కానీ ఆయన మరణం తర్వాత శ్రీదేవి తల్లి అతిభద్రతాభావం కారణంగా శ్రీదేవి జీవితం పంజరంలో పక్షిలా మారిపోయింది. పన్నుల భయం కారణంగా ఆరోజుల్లో నటీనటులకు నల్లధనాన్నే రెమ్యునరేషన్ గా ఇచ్చేవారు. శ్రీదేవి తండ్రి బంధువులను, స్నేహితులను బాగా నమ్మేవారు. ఆ డబ్బును వారిదగ్గర దాచారు. తండ్రి చనిపోయిన తర్వాత ఆ డబ్బును శ్రీదేవికి ఇవ్వకుండా అందరూ మోసం చేశారు. దీనికి తోడు లిటిగేషన్ లో ఉన్న ఆస్తులను ఆమె తల్లి కొనుగోలు చేయడంతో పాటు కొన్ని తప్పులు కారణంగా శ్రీదేవి డబ్బంతా అయిపోయింది. శ్రీదేవి చేతిలో చిల్లిగవ్వ లేని సమయంలో బోనీకపూర్ ఆమె జీవితంలో ప్రవేశించారు. ఆ సమయంలో బోనీకి కూడా అప్పులు బాగానే ఉన్నాయి. శ్రీదేవి కన్నీళ్లు తుడవడం తప్ప చేయగలిగిందేమీ లేదు. ఆస్తుల విషయంలో శ్రీదేవి సోదరి శ్రీలత కూడా ఆమెను మోసం చేసింది. శ్రీదేవి తల్లికి అమెరికాలో బ్రెయిన్ సర్జరీ చేశారు. ఆ సర్జరీ సరిగా చేయకపోవడంతో ఆమె మెంటల్ పేషెంట్ అయ్యారు. శ్రీదేవి సోదరి శ్రీలత పక్కింటి అబ్బాయిని పెళ్లిచేసుకుంది.
శ్రీదేవి తల్లి చనిపోయేముందు ఆస్తులన్నీ శ్రీదేవి పేరు మీదనే రాశారు. ఈ వీలునామా రాసే సమయంలో తన తల్లి మానసిక వ్యాధిగ్రస్తురాలని ఆరోపిస్తూ శ్రీలత కోర్టులో కేసువేసి ఆ ఆస్తి చేజిక్కించుకుంది. శ్రీదేవి వైవాహిక జీవితంలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. బోనీని రెండో వివాహం చేసుకున్నందుకుగానూ అతని తల్లి శ్రీదేవిని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లాబీలో అందరిముందు పొట్టపై తన్నింది. మొత్తంగా ఇంగ్లిష్ వింగ్లిష్ సమయంలో తప్ప ఎప్పుడూ ఆమె తనకు నచ్చిన జీవితం గడపలేదు. చాలా అసంతృప్తితో ఉన్న మహిళ శ్రీదేవి. నిత్యం ఆమె తల్లిదండ్రులు, బంధువులు, భర్త సూచనల మేరకే నడుచుకునేవారు. చివరకు పిల్లల విషయంలో కూడా కొంత ఒత్తిడికి గురయ్యేవారు. మొత్తానికి శ్రీదేవి మానసిక పరిస్థితి నిత్యం ఉన్నతశ్రేణి గందరగోళాలతో నిండుకుంటూ ఉండేదని వర్మ అన్నారు. ఇలాంటి లేఖలు ఇకముందు కూడా రాస్తూ ఉండవచ్చేమోగానీ… తన కన్నీటిని మాత్రం ఎప్పటికీ ఆపుకోలేనంటూ ఆయన లేఖ ముగించారు.