కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వెంకన్న సన్నిధిలో అనేక అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ప్రభుత్వం, పాలక మండలి వలనే ఈ అక్రమాలు జరుగుతున్నాయని మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు గత కొద్ది రోజులుగా ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. ఆయన చేసిన ఆరోపణలకు టీటీడీ లీగల్ నోటీసులు జారీచేసింది. తాజాగా ఈరోజు హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో రమణదీక్షితులు ప్రెస్ తో ఈ విషయాల మీద స్పందించారు రమణ దీక్షితులు. శ్రీవారి సంపద గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కోట్లాది మంది భక్తులు తమ ఇలవేల్పుగా భావించి కొలుచుకునే తిరుమల శ్రీనివాసుడి మహిమలు అపారమైనవని స్వామి గురించి పురాతన తాళపత్ర గ్రంథాల్లో ఉన్న వివరాలు తెలుసుకుంటే భక్తులకు మతి పోతుందని రమణదీక్షితులు పేర్కొన్నారు. “కృష్ణదేవరాయలవారి తరువాత మూడవ మహారాజుగా విజయనగర సామ్రాజ్యాధిపతిగా తిరుమలరాయల వారు వచ్చారు. వారు సుమారు 1000 ఏనుగులు, 30 వేల అశ్వాలపై అమూల్యమైన సంపదను… వారికి యుద్ధ విజయాల్లో ప్రాప్తించిన సంపదనంతా తిరుమలకు తీసుకు వచ్చి ఎక్కడో నిక్షిప్తం చేశారని మనకు శాస్త్రాల్లో తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. కానీ, కలియుగంలో మనుషులకు తీవ్రమైన దురాశ కలిగి దైవమంటే భయం, భక్తి ఉండవని భావించి, ఆ సంపదనంతా కొన్ని ప్రదేశాల్లో సామాన్యుల ఊహకు అందని విధంగా నిక్షిప్తం చేశారని వాటిలో చెప్పబడివుందన్నారు.
“1800వ సంవత్సరం సమయంలో కలెక్టరుగా ఉన్న ఒక తెల్ల జాతీయుడు తిరుమలకు వచ్చి, తిరుమల దేవాలయంలో జరిగే అన్ని కార్యక్రమాలనూ సవివరంగా సమీక్షించారని. అర్చకులు, పరిచారకులు అదే విధంగా స్వామివారి దేవాలయాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న అనేకమైన వృత్తులవారు (కుమ్మరి వాళ్లు, దొమ్మరి వాళ్లు, ముగ్గులు వేసేవారు, అరటిమానులు కట్టేవారు, ఏనుగులను చూసుకునేవారు, అశ్వాలను చూసుకునేవారు, స్వామివారి వాహనాలను మోసేవారు, స్వామివారి ఆలయాన్ని కాపాడేవాళ్లు) వీరందరినీ పిలిపించి, వారి కర్తవ్యాలు, వారు చేసే సేవలు, అందుకు ఫలితంగా వారికి లభించే వరుంబడి గురించి ఆరా తీసి వీటన్నింటినీ కూడా ప్రశ్నోత్తరాలుగా క్రోఢీకరించి ‘సవాల్ జవాబ్ పట్టీ’ అనే దాన్ని తయారు చేశారని, అది మనకు ఇప్పటికీ ప్రామాణికమైన గ్రంథంగా ఉందని దీక్షుతులు పేర్కొన్నారు. అందులో ఈ స్వామివారి కైంకర్యాలు, వాటి ప్రాముఖ్యతను వివరించిన తరువాత ఒకచోట స్వామివారికి ఉన్న తిరువాభరణాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారని ఆయన పేర్కొన్నారు. స్వామివారిని 1000 కోట్ల దేవుడని పిలిచేవారని, ముఖ్యంగా ప్రతాపరుద్రుడనే కాకతీయ మహారాజు ఇప్పటి వరంగల్ దగ్గరలో కోటను స్థాపించి, సుమారు 50 సంవత్సరాలు పాలించిన అతి ప్రముఖుడైన చక్రవర్తి స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు, 18 లక్షల బంగారు మొహరీలు ఉపయోగించి, మూలవిరాట్టుకు (తొమ్మిదిన్నర అడుగుల ఎత్తైన మూలవరులకు) నవరత్న కవచాన్ని తయారుచేసి ‘రత్నాంగిణి’ అనే పేరుతో సమర్పించినట్టు, తరువాత అదే సందర్భంలో ఒక్కోటి కిలో బరువుండే 18 లక్షల బంగారు మొహర్లతో స్వామికి కనకాభిషేకం నిర్వహించారని ఆయన పేర్కొన్నారు.
ఇంకా ఎన్నో అమూల్యమైన నవరత్నాలను, బంగారు విగ్రహాలను స్వామివారి దేవాలయం మొదటి ప్రాకారంలో ఓ నేలమాళిగలో ఉంచారు. ఆ నేలమాళిగ కొలతలు కూడా అందులో చెప్పారు. ఆ నేలమాళిగలో భద్రపరిచి, పైన తలుపులు వేసి మూసిన తరువాత, దానిపై బండలు పరిచారని, అది సామాన్య భక్తులు ప్రవేశించలేని విధంగా ఉంటుందని వివరంగా చెప్పబడిందని రమణ దీక్షితులు వెల్లడించారు. అంతకన్నా ముందు పల్లవులు, చోళులు తదితర చక్రవర్తులు, వారి సామంతరాజులు ఇచ్చిన అమూల్యమైన ఆభరణాలను కూడా మొదటి ప్రాకారంలో దాచారని తాళపత్ర గ్రంథాలు చెబుతున్నాయన్నారు. తొలి ప్రాకారంలో భక్తులు వెళ్లలేని ప్రదేశాలు రెండున్నాయని, వాటిల్లో ఒకటి స్వామి గర్భాలయం అయితే, రెండోది యాగశాలని తెలిపారు. ప్రతి నిత్యమూ ఉదయం తరువాత దాన్ని యాగశాల మూసివేస్తారని వెల్లడించిన రమణ దీక్షితులు, దాని పక్కనే దక్షిణ ఆగ్నేయంలో కట్టబడిన స్వామివారి వంటశాల ఉందని, దీనిలోకి వంటవారు, అర్చకులు మినహా మరెవరూ వెళ్లేందుకు వీల్లేదని చెప్పారు. ఎటునుంచి చూసినా, ఇతరులకు ప్రవేశం లేని వంటశాలలోనే నేలమాళిగలకు దారి ఉందన్న విషయం అర్ధమవుతోంది అని ఆయన అన్నారు. గతేడాది డిసెంబర్ 8 న స్వామివారి లోపలి పోటును మూసేశారని, ఆ విషయం తనకు తెలిసి అడగడంతో నాలుగు రాతి బండలు పగిలాయని, కొద్ది రోజులు పోటు మూసివేశామని జేఈఓ శ్రీనివాసరాజు చెప్పినట్టు పేపర్లలో వచ్చిన విషయాన్ని దీక్షితులు గుర్తుచేశారు. స్వామి ప్రధానార్చకుడిగా, వైఖానస ఆగమశాస్త్ర సలహాదారుగా ఉన్న తనకు, మరో ముగ్గురు ప్రధానార్చకులకు తెలియకుండానే పోటు మూసివేయడం ఎలా జరిగింది? ఆ సమయంలో అన్న ప్రసాదాలు ఎక్కడ తయారు చేశారు? తదితర విషయాలు తనకు తెలియదని అన్నారు. అంతేకాదు ఎవరి సలహా తీసుకుని ఈ పని చేశారో తెలియదని విమర్శించారు. స్వామి గుప్త నిధుల కోసమే తవ్వకాలు జరిపారన్న తన ఆరోపణలపై సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. జరుగుతున్న అన్యాయాలను, తప్పులను ఎత్తి చూపినందుకే తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు రమణ దీక్షితులు.