Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసానికి ఎన్నో ప్రత్యేకతలుంటాయి. ఈ మాసమంతా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు, కఠిన ఉపవాస దీక్షలు చేస్తారు. ఈ మాసంలో ముస్లింలు తప్పనిసరిగా రోజుకు ఐదుసార్లు నమాజ్ చేయడంతో పాటు ప్రత్యేక ప్రార్ధనలు జరుపుతారు. మానవులను కష్టాల నుంచి కాపాడేందుకు మహ్మద్ ప్రవక్త హజరత్ రసూల్ ఇల్లల్లాహి ఈ మాసాన్ని సృష్టించినట్టు ముస్లింలు నమ్ముతారు. దీంతో పాటు ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ఆవిర్భవించింది కూడా ఈ మాసంలోనే. అందుకే ఖురాన్ ప్రకారం రంజాన్ మాసంలో ముస్లిం కుటుంబాలు పిల్లా, పెద్దా తేడాలేకుండా ఉపవాసదీక్షలు ఆచరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ క్యాలెండర్ లో తొమ్మిదో నెల రంజాన్ మాసం.
ఈ నెలలో ఉపవాసవ్రతాన్ని ముస్లింలు విధిగా ఆచరిస్తారు. రోజాగా పిలిచే ఈ ఉపవాసం కఠిన సవాళ్లతో కూడుకుని ఉంటుంది. ఉపవాసవ్రతం చేపట్టే ముస్లింలు రంజాన్ నెల ప్రారంభంకాగానే తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆహారం తీసుకుని దీక్ష ప్రారంభిస్తారు. ఆ తర్వాత సూర్యాస్తమయం వరకు ఎలాంటి ఆహారం స్వీకరించారు. ఆహారమే కాదు… పచ్చి మంచినీళ్లు కూడా ముట్టరు. కనీసం నోటిలోని ఉమ్మి కూడా మింగకూడదు. సూర్యాస్తమయం తర్వాత ఖర్జూరపండు తిని ముస్లింలు దీక్ష విరమిస్తారు. పలు ప్రాంతాల్లో ఉప్పుతో కూడా దీక్ష ముగిస్తారు.అనంతరం వివిధ రకాల రుచికరమైన వంటలు భుజిస్తారు. ఉపవాసదీక్షలు సహారీతో ప్రారంభమై ఇఫ్తార్ తో ముగుస్తాయి.
ఈ మాసంలో దీక్షలు పాటించి, మనస్ఫూర్తిగా ప్రార్థనలు చేసేవారి కోరికలను అల్లా తీరుస్తాడని ముస్లింలు నమ్ముతారు. 30 రోజుల దీక్షలను మూడు భాగాలుగా విభజించి వాటికి ప్రాధాన్యత కల్పించారు. మొదటి పదిరోజుల్లో దీక్షలు పాటిస్తే అల్లా కరుణ వర్షాన్ని కురిపిస్తాడని, 10 నుంచి 20 రోజులు దీక్షలు పాటిస్తే చేసిన పాపాలను హరిస్తాడని, మిగిలిన 10 రోజుల దీక్షలను పూర్తిచేస్తే నరక బాధ తప్పిస్తాడని ఓ నమ్మకం. ఉపవాసంతో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అదుపులో ఉంటాయని, ఇలా శరీరాన్ని శుష్కింపచేసుకుంటే ఆత్మ ప్రక్షాళన అవుతుందని కూడా ముస్లింలు భావిస్తారు.
ఉపవాస దీక్షలతో బలహీనతలు, వ్యసనాలు జయించవచ్చని ఇస్లాం మతగురువులు చెబుతారు. ఉపవాసం వల్ల జీర్ణశక్తి పెరిగి, ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రం చెబుతోంది. ఏ విధంగా చూసినా పవిత్ర రంజాన్ మాసంలో చేసే ఉపవాసం వల్ల అనేక లాభాలున్నాయని ముస్లింలు చెబుతుంటారు. ఇక రంజాన్ మాసంలో చేసే నమాజ్ కూడా ఎంతో ప్రాశస్త్యమైనది. మామూలుగా ప్రతి శుక్రవారం ముస్లింలు నమాజ్ చేస్తుంటారు. రంజాన్ మాసంలో మత పెద్దలతో కలిసి నమాజ్ చేస్తారు. ఫజర్, జోహార్, అసర్, మగ్రిబ్, ఇషా పేరుతో రోజుకు ఐదుసార్లు నమాజ్ చేయడంతో పాటు అల్లాను ప్రసన్నం చేసుకునేందుకు ఖురాన్ పఠిస్తారు.